అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతకైనా తెగిస్తారని, అలాంటి వ్యక్తి ఈ సమాజానికి ప్రమాదకారి అని వైఎస్సార్‌సీపీ నేత పోసాని కృష్ణమురళి చెప్పారు. చంద్రబాబూ.. దయచేసి మంచి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హత్యకు కుట్రలు పన్నకండి అని అన్నారు. ‘నన్ను చంపినా పరవాలేదు. ప్రజల మనిషి సీఎం జగన్‌ను మాత్రం హత్య చేయకండి. ఆయన జోలికి మాత్రం రావొద్దు. ఆయన్ని చంపితే ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలను చంపినట్టే.
ఎందుకంటే రాష్ట్ర ప్రజల జీవితాలు, భవిష్యత్తు నాశనం అవుతాయి’ అని చెప్పారు. పోసాని సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాబుకు మనిషిని చంపడమంటే గడ్డి పోచతో సమానం. ఆయనకి తెలియకుండా ఏపీలో హత్యలు జరగవు అని ఆరోపించారు.
‘సీఎం జగన్‌కు మద్దతు తెలిపిన రాంగోపాల్‌వర్మను మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి, ఆ తర్వాత ఆగారు. ఈ విషయం నేను రాంగోపాల్ వర్మకు కూడా చెప్పలేదు. మంచి చేసిన పాలకులకు మద్దతు పలికితే చంపేస్తారా? ప్రముఖ జర్నలిస్టు ఐ.వెంకట్రావు కుమారుడు అనిల్ దీనిలో ముఖ్యుడు. నా తల్లి సాక్షిగా చెప్తున్నా. నీ పేరే చెప్పారు. మన కమ్మ వాళ్లే చెప్పారు. అనిల్ ప్లాన్ చేస్తే.. రాజేశ్ కిలారుకు చెప్పారు. దీనికి నారా లోకేశ్ కూడా ఒకే అన్నారు. చంద్రబాబు దానికి నో అన్నారు. అతను పిచ్చోడు, అతన్ని చంపితే మనకొచ్చేదేముంది. వదిలేయండి అని అన్నారు. రాంగోపాల్ వర్మ స్థానంలో నేను కావచ్చు. అయినా నేను లెక్కచేయను. ఓడిపోతే మనిషికి లక్ష రూపాయలు ఇచ్చి మళ్లీ గెలవండి. కానీ, హత్యలు చేయకండి’ అని అన్నారు.
‘మీ అమ్మను తిడితే ఎప్పుడైనా లోకేశ్ చొక్కా పట్టుకున్నావా పవన్? నీకు నాలుగో పెళ్లాం లేదా? అయిదో పెళ్లాం కూడా వెయిటింగ్ లిస్ట్ కదా? వలంటీర్ ఆడపడుచులను ట్రాఫికింగ్ చేస్తారన్నప్పుడు తప్పు అనిపించలేదా? డెడికేషన్ అంటే సీఎం జగన్‌ది. పెద్ద పెద్ద వారిని ఎదుర్కొన్నారు. పవన్ ఆయన వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకోవాలి. తనని చంద్రబాబు బచ్చా అన్నా సీఎం జగన్ తొణకలేదు. చంద్రబాబు నన్ను ఇలా అంటున్నారు అంటూ నింపాదిగా ప్రజలకు చెప్పారు. పవన్‌లా గెంతులేసి కొట్టేస్తా.. తిట్టేస్తా.. అనడంలేదు.
చంద్రబాబు దగ్గర నేర్చుకోడానికి ఏమీ లేదు. రాంగ్ రూట్‌లో సీఎం ఎలా అవ్వాలి, డబ్బెలా సంపాదించాలి, వెన్నుపోటు ఎలా పొడవాలన్నదే చంద్రబాబుకు తెలుసు. చంద్రబాబు జనంలో నుంచి పుట్టిన నాయకుడు కాదు. మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మళ్లీ జనంలోకి వెళ్లరు, జనాన్ని నమ్మరు. చంద్రబాబు ఓటర్లను ఎలా బురిడీ కొట్టించాలా, ఎలా కొనుగోలు చేయాలా అని అనుకుంటారు. సీఎం జగన్ ప్రజలను నమ్ముకుంటారు. ప్రజలకు మంచి చేయాలనుకుంటారు. ప్రజలంటే ఆయనకు ప్రేమ. ఇదే వారిద్దరి మధ్య తేడా’ అని పోసాని చెప్పారు.
source : sakshi.com
Discussion about this post