మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడ్డాడు. యాత్రలో భాగంగా శనివారం రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్‌కు చేరుకోగానే హత్యకు ప్రయత్నించాడు. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది. దీంతో సీఎం పక్కకు తూలి.. ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు. ఆయన ఎడమ కన్ను పైభాగం వాచిపోయింది.
బలమైన గాయం కావడంతో రక్తం కారింది. అయినప్పటికీ బాధను పంటి బిగువన భరిస్తూనే సీఎం వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేసి.. బస్సుపై నుంచి దిగి లోపలకి వెళ్లారు. డాక్టర్ హరికృష్ణ ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం సీఎం జగన్ యధావిధిగా బస్సు యాత్రను కొనసాగించారు. కాగా ఆ వస్తువు పదును, వేగాన్ని బట్టి అది రాయి, గ్రానైట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం జగన్ ఎడమ కంటి పై భాగాన గాయమయ్యాక.. ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కూ తగలడంతో ఆయనకు కూడా గాయమైంది.
సీఎం వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి విజయవాడ చేరుకుంటారని ముందే తెలుసుకున్న ఆగంతకుడు ఇందుకు తగ్గట్టే ముందస్తు కుట్ర, ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సు యాత్ర విజయవాడలోకి శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రవేశించింది. బస్సు యాత్ర సాగే మార్గంలో విద్యుత్ సరఫరాను నిలిపేస్తుండటాన్ని ఆగంతకుడు ఆసరాగా చేసుకున్నాడు. సీఎం జగన్‌ను హత్య చేయాలనే ముందస్తు వ్యూహంలో భాగంగానే సింగ్‌నగర్ డాబా కొట్ల సెంటర్‌లోని వివేకానంద స్కూల్ రెండో అంతస్తులో ఓ గదిలో నక్కాడు.
తాము ఉన్న గది కిటీకి తలుపులను తెరిచే ఉంచాడు. రోడ్ షో అక్కడికి చేరుకోగానే సీఎం జగన్ లక్ష్యంగా హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అత్యంత వేగంగా దూసుకొచ్చిన పదునైన వస్తువు సీఎం జగన్ ఎడమ కంటి కనుబొమ పైభాగాన తగలడంతో ఆయనకు తీవ్ర గాయమైంది. ఎడమ కన్ను వాచిపోయింది. ఎడమ కంటి కనుబొమ పైభాగాన బలమైన గాయం నుంచి రక్తం కారిపోతున్నా చలించక సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేసి బస్సుపై నుంచి కిందకు దిగి లోపలకి వెళ్లారు.
సీఎం జగన్‌పై ఎయిర్ గన్ తో హత్యాయత్నం చేసి ఉండొచ్చని అంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సౌండ్ విన్నానని చెబుతుండటంతో సీఎంపై హత్యాయత్నానికి ఎయిర్ గన్‌నే వినియోగించి ఉండవచ్చని బలంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో గాయపడ్డ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కూడా సీఎం వైపు దూసుకొచ్చిన పదునైన వస్తువు వేగాన్ని బట్టి ఇది హత్యాప్రయత్నమేనన్నారు. చంద్రబాబు నాయుడే ఈ దురాగతానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కొందరు క్యాటర్ బాల్‌ను వినియోగించారని అంటున్నారు.
source : sakshi.com
Discussion about this post