జగనన్న పాపాలు పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కక్షగట్టి ముందస్తుగా ఎటువంటి వివరణలు తీసుకోకుండా కావాలని అవాస్తవాలతో తప్పుడు కథనాలు అచ్చేస్తున్న ఈనాడు దినపత్రిక ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన న్యాయవాది, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాకుమాను బాలహనుమంతరెడ్డి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదివారం వెలగపూడిలోని ఎన్నికల అధికారులకు, కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు ఇచ్చారు.
ఈనాడు ఆదివారం ఎడిషన్‌లో ప్రజారోగ్యానికి పట్టిన వైరస్ జగన్, జగనన్న కాళ్లకింద జనజీవన హక్కు, జగన్ ప్రచార కక్కుర్తి, పనితక్కువ ప్రగల్భాలు ఎక్కువ, కేంద్ర నిధులు హుష్‌కాకి.. అంటూ ఇంకా పలు హెడ్‌లైన్లతో ప్రభుత్వం నుంచి, ఆయా విభాగాల నుంచి ముందుగా ఎటువంటి వివరణ తీసుకోకుండానే వార్తలను వండి వార్చారని తెలిపారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకున్నదనే కక్షతో సీఎం జగన్ పరువు ప్రతిష్టలను దిగజారుస్తూ వార్తలను అచ్చేస్తున్నారని పేర్కొన్నారు. ఇవి ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధమని తెలిపారు. వెంటనే ఆ పత్రిక పబ్లిషర్, న్యూస్ రిపోర్టర్లపై చర్యలు తీసుకుని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రిపోర్టు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
source : sakshi.com
Discussion about this post