సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమైందని వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త మాలగుండ్ల శంకర్ నారాయణ అన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున పదవులు ఇచ్చి బలమైన వర్గాలుగా తీర్చిదిద్దారని కొనియాడారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కేబినెట్‌లో 25 మందికి గానూ 11 మంది బీసీలకు అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 84 మంది మున్సిపల్ చైర్మన్లు ఉంటే అందులో 44 మంది బీసీలేనన్నారు. 14 మేయర్ పోస్టుల్లో 9 మంది, 13 జెడ్పీ చైర్మన్లలో ఆరుగురు, 44 మంది శాసన మండలి సభ్యుల్లో 30 మంది, 637 ఎంపీపీలలో 237 మంది బీసీలకు అవకాశం కల్పించారన్నారు. ఇదే కాకుండా, 135 కార్పొరేషన్లలో 55 కార్పొరేషన్లకు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే చైర్మన్లుగా ఉన్నారన్నారు. బడుగులు అగ్రవర్ణాలతో సమానంగా ఎదగాలన్న మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కలలను సీఎం జగన్ సాకారం చేశారన్నారు. ‘నవరత్నాల’లో భాగంగా రూ.2.55 లక్షల కోట్లు విడుదల చేస్తే, అందులో రూ.1.26 లక్షల కోట్లు బీసీలకే అందాయన్నారు. బీసీల సంక్షేమానికి ఎంతగా పెద్ద పీట వేశారో దీన్ని బట్టే అర్థమైపోతుందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు బీసీ సామాజిక వర్గాల సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదని శంకరనారాయణ విమర్శించారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నాటకాలకు తెరలేపారన్నారు. 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించారంటూ అవాస్తవాలు ప్రచారం చేశారన్నారు. బీసీ డిక్లరేషన్ అంటూ మళ్లీ వంచించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. దివంగత నేత వైఎస్సార్ హయాంలోనే గీత, చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్ అందించే కార్యక్రమానికి బీజం పడిందని, నేడు తానేదో కొత్తగా ఇస్తామన్నట్లు ప్రకటించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. అలాంటి వ్యక్తికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వంత పాడుతుండడం హేయమన్నారు. టీడీపీ పాలనలో బీసీల కోసం ఎంత ఖర్చు చేశారు, తమ ప్రభుత్వంలో ఎంత మేలు చేశాం అనే అంశంపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు మోసాలను పసిగట్టిన బీసీలు 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పారని, మళ్లీ ప్రజాకోర్టులో ఆయనకు గుణ పాఠం తప్పదని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జోనల్ ఇన్‌చార్జ్ రమేష్‌గౌడ్ మాట్లాడుతూ 2014 ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో 110 హామీలను ఇచ్చిన చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. బీసీలు జడ్జిలుగా పనికిరారంటూ సుప్రీంకోర్టు కొలీజియానికే లేఖ రాసిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. టీడీపీ ప్రకటించిన 94 సీట్లలో కేవలం 18 మాత్రమే బీసీలకు కేటాయించారంటేనే ఆయనకు వారిపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందన్నారు. సీఎం వైఎస్ జగన్ బీసీలకు రాజ్యాధికారం కల్పించారని,రానున్న ఎన్నికల్లో బీసీలంతా వైఎస్సార్‌సీపీవైపే ఉంటారని స్పష్టం చేశారు. సమావేశంలో ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, కార్పొరేటర్ శ్రీనివాసులు, పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
source : sakshi.com
Discussion about this post