వైకాపా రాజకీయ ప్రయోజనాలను ప్రోత్సహించేలా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి, రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాల్లో ప్రకటనలు (అడ్వర్టైజ్మెంట్లు) ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఇకపై జారీ చేసే ప్రకటనల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాల్సిందేనంటూ రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వ్యక్తిగత హోదాలో నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, కాగ్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్, వైకాపా ప్రధాన కార్యదర్శి, జగతి పబ్లికేషన్స్ ఎండీ, ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ ఎండీ, విశాఖలోని సీబీఐ ఎస్పీ, దిల్లీలోని సీసీఆర్జీఏ (ప్రభుత్వ ప్రకటనల్లో కంటెంట్ రెగ్యులేషన్ కమిటీ) కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను మార్చి 6కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వైకాపా రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం (2019 జూన్ నుంచి) ప్రకటనలకు కోట్లు ఖర్చు చేసిందని, ఇలాంటి చర్య సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమంటూ బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వం ఖర్చు చేసిన సొమ్మును వైకాపా నుంచి రాబట్టాలని కోరారు. ప్రజాధనం దుర్వినియోగం, ప్రకటనల జారీ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని అభ్యర్థించారు. జగతి పబ్లికేషన్స్‌కు ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని విన్నవించారు.
వైకాపాను ప్రోత్సహించేలా, గత ప్రభుత్వాన్ని కించపరిచేలా..
బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపించారు. రాజకీయ పార్టీల విషయంలో ప్రభుత్వం తటస్థంగా ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా అధికార పక్షాన్ని ప్రోత్సహించడానికి, ప్రతిపక్షాలను విమర్శించడానికి వీల్లేదన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా రూ.కోట్లలో ప్రజాధనం ఖర్చు చేసి వైకాపా ప్రయోజనాలను ప్రోత్సహించేలా, గత ప్రభుత్వాన్ని కించపరిచేలా ప్రకటనలు ఇచ్చిందన్నారు. ఆ ప్రకటనలు ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచేవిగా కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతిష్ఠను పెంచేవిగా ఉన్నాయన్నారు. వివిధ పత్రికల్లో వచ్చిన ప్రభుత్వ ప్రకటనలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వైకాపా జెండా రంగులను ప్రకటనల్లో వినియోగించారన్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల పథకాలను పోల్చిచెప్పడం సరికాదన్నారు. ప్రకటనలకు ఖర్చు చేసిన సొమ్మును వైకాపా నుంచి రాబట్టాలన్నారు.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సుమన్ వాదనలు వినిపిస్తూ.. పిల్ దాఖలు చేయడంలో దురుద్దేశం ఉందన్నారు. 2019 తర్వాత ఇచ్చిన ప్రకటనల గురించి మాత్రమే పిటిషనర్ ప్రస్తావించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రకటనలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. వివరాలు సమర్పించేందుకు సమయం కావాలన్నారు. దీంతో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. ఇకపై ఇవ్వబోయే ప్రకటనల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
source : eenadu.net
Discussion about this post