నాలుగు దశాబ్దాలుగా హిందూపురానికి ఎమ్మెల్యేలుగా టీడీపీకి చెందిన వారే ఉంటున్నా… ఈ ప్రాంత అభివృద్ధికి వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక అన్నారు. కేవలం సినిమాలకే పరిమితమైన ఎమ్మెల్యే బాలకృష్ణ పట్టణాభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. ఏళ్ల తరబడిగా కుంటుపడిన అభివృద్ధిని ఈ నాలుగున్నరేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. హిందూపురం 38వ వార్డు పాతూరులో కౌన్సిలర్ రాధమ్మ అధ్యక్షతన శుక్రవారం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న దీపిక ప్రతి గడపనూ సందర్శించి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పథకాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. రెండుసార్లు బాలకృష్ణను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హిందూపురం ప్రజలకు ఆయన చేసిన మంచి ఏదీ లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లో అవసరం లేకున్నా రోడ్డుపై రోడ్డు వేసి నిధులు అడ్డగోలుగా దోచేశారన్నారు. దీంతో ఏళ్ల తరబడి అభివృద్ధికి హిందూపురం నోచుకోలేక పోయిందన్నారు. సంక్షేమ పాలనకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రాధాన్యత క్రమంలో పలు వార్డుల్లో ఇప్పటికే రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సౌకర్యాలు కల్పించినట్లు గుర్తు చేశారు. త్వరలో మిగిలిన ప్రాంతాల్లోనూ మౌలిక సౌకర్యాలను కల్పించి అభివృద్ధి చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని గెలిపించి హిందూపురం సమగ్రాభివృద్ధికి సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
source : sakshi.com
Discussion about this post