వైఎస్ వివేకానందరెడ్డి శరీరంపై తీవ్ర రక్త గాయాలను చూస్తే గుండెపోటు అని ఎవరికైనా అనిపిస్తుందా..? అని ఆయన కుమార్తె సునీత ప్రశ్నించారు. సాక్షి మీడియాలో ఎందుకు గుండెపోటు మరణంగా ప్రసారమైందనే కోణంలో ఆ సంస్థ ఛైర్‌పర్సన్‌ను, అలా ఎందుకు చెప్పారని విజయసాయిరెడ్డిని విచారించరా? అని అడిగారు. ‘వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామున ఫోన్‌కాల్స్ ఎవరికి వెళ్లాయి..? హత్య చేస్తుండగా ప్రత్యక్ష ప్రసారం చేశారా? ఈ అనుమానాలను నివృత్తి చేయాలి. హత్య జరిగిన గదిలోంచి సాక్షి మీడియాకే తొలుత సమాచారం వెళ్లింది’ అని ఆరోపించారు. సాక్షి కడప విలేకరి బాలకృష్ణకు 6.24 గంటలకు ఫోన్‌కాల్ వెళ్లిందన్నారు. సాక్షి యజమానికి ప్రత్యక్ష సమాచారం తెలిసినా ఎందుకు సరిచేసుకోలేదో తేలాలన్నారు. స్థానిక సీఐని బెదిరించి మరీ రక్తపు మరకల్ని శుభ్రం చేయించడం వెనక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. సీబీఐ ఇంకా దర్యాప్తు పూర్తిచేయలేదని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరి ఒత్తిడి వల్లనో దర్యాప్తు ఆపేశారనే అనుమానం ఉందన్నారు. భాజపాతో జగన్‌కు ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. హత్యకు సంబంధించిన కీలక సమాచారాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు.
‘2019 మార్చి 14న అర్ధరాత్రి దాటాక జరిగిన వివేకా హత్యకేసులో ఎర్ర గంగిరెడ్డి, గజ్జెల ఉమాశంకర్‌రెడ్డి, యాదాటి సునీల్‌యాదవ్, షేక్ దస్తగిరి నిందితులుగా సీబీఐ అభియోగపత్రంలో పేర్కొంది. కానీ 2023 ఏప్రిల్ 27న అవినాష్‌రెడ్డి ఒక వీడియోలో మాట్లాడుతూ వివేకా హత్యకేసు నిందితులను తాను గుర్తుపట్టలేనని.. వారి గురించి మీడియాలో ప్రసారమైన తర్వాతే చూసి గుర్తించానని చెప్పారు. అదంతా అబద్ధం..’ అని సునీత పేర్కొన్నారు.
source : eenadu.net
Discussion about this post