సాక్షి సంస్థలో తనకు సగం వాటా ఉందని.. ఇప్పుడు ఆ సంస్థ తన పైనే బురద చల్లుతోందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఆస్తిలో జగన్‌కు, తనకు సమాన భాగం ఉండాలని తమ తండ్రి వైఎస్సార్ నిర్ణయించారని పేర్కొన్నారు. సోమవారం కడపలో జరిగిన వైయస్‌ఆర్, అన్నమయ్య జిల్లాల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల మాట్లాడారు. ‘తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్లకు సాక్షి సంస్థ నుంచి ఫోన్లు చేస్తున్నారు. నా గురించి వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. అన్ని కథలూ చూస్తా. వైకాపాను అధికారంలోకి తేవడానికి 3,200 కి.మీ పాదయాత్ర చేశా.. జగన్ కోసం అంత త్యాగం చేస్తే నాపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. వాస్తవాలను మరిచి సాక్షి పత్రిక ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తోంది. వైకాపా నాయకులు ఏం చేసినా, సాక్షి పత్రిక ఏం రాసినా భయపడే ప్రసక్తే లేదు. వెనక్కి తగ్గేదీ లేదు.
ఇటీవలే ఒక జోకర్‌తో ఆ ఛానల్ వారు మాట్లాడించారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు నా భర్త అనిల్.. సోనియాను కలిసినట్లు ఆయనతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారట. జగన్‌ను బయటకు రానివ్వొద్దంటూ లాబీయింగ్ చేశామట. ఇప్పుడు బదులు చెప్పడానికి ప్రణబ్ లేరు. అప్పుడు అనిల్, భారతి కలిసే సోనియా వద్దకు వెళ్లారు. భారతికి తెలియకుండా సోనియాను పదవి కోసం అనిల్ అడిగారా? భారతిరెడ్డి లేనప్పుడు అడిగారా? కనీసం ప్రణబ్ కుమారుణ్ని అడిగైనా నిజాలు చెప్పించండి. నాకు పదవీకాంక్ష ఉంటే.. నాన్న ఉండగానే అడిగి తీసుకోనా? వైకాపాలోనైనా తీసుకోనా? మీకోసం నేనెందుకు పాదయాత్ర చేస్తా? నా కోసం నేను చేసుకునేదాన్ని.
వైఎస్సార్.. కడప నుంచి బెంగళూరుకు రైల్వేలైను ప్రాజెక్టు తెస్తే.. ఆ ప్రాజెక్టే అవసరం లేదని కేంద్రానికి జగనన్న లేఖ రాశారు. చిన్నపాటి లైన్ చాలంటూ సర్దుకున్నారు. జగనన్న వ్యవహారం మట్టి బిందెను తీసుకుని బంగారు బిందె ఇచ్చినట్లుంది. ప్రధాని మోదీతో దోస్తీ చేసే మీరు.. ప్రాజెక్టులను ఎందుకు తేలేకపోయారు? నిర్వహణ లేక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే మరలా కట్టలేదు. రోడ్డున పడ్డ కుటుంబాలను పట్టించుకోలేదు. వైఎస్సార్ ఎప్పుడూ భాజపా విధానాలను వ్యతిరేకించేవారు. అలాంటి వ్యక్తి ఆశయాలను జగనన్న నిలబెడుతున్నారా? మైనారిటీలు, క్రిస్టియన్లపై భాజపా దాడులు చేస్తుంటే జగనన్న స్పందించడం లేదు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించలేని మీరు ఆయన వారసులు ఎలా అవుతారు? పోలవరం గురించి అడిగే సత్తాలేదు. హోదా కోసం మాట్లాడే పరిస్థితి లేదు’ అని షర్మిల వరుస విమర్శలు గుప్పించారు. సమావేశంలో కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, రాష్ట్ర మాజీ మంత్రి రఘువీరారెడ్డి, మాజీ ఎంపీ తులసిరెడ్డి, సీనియర్ నేతలు గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post