ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. సీఎస్ జవహర్‌రెడ్డి ఇప్పటికీ జగన్ గీసిన గీత దాటరు. జగన్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తితిదే ఈఓ ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ను పొడిగించుకోగలరు. తన ప్రతి ఎన్నికల ప్రచారసభకూ వెయ్యికి మించిన ఆర్టీసీ బస్సుల్నీ రప్పించుకోగలరు. ఐదేళ్లుగా అప్రతిహత అధికారాన్ని చలాయిస్తూ, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇప్పటికీ అదే స్థాయిలో శాసిస్తున్న జగన్… ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలని మాత్రం సీఎస్‌ను ఆదేశించడం లేదు. ఆ అంశంపై కనీసం నోరు మెదపట్లేదు. ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాయలేదు. ఎందుకు? ఇంటింటికీ పింఛన్ల పంపిణీ తన మానసపుత్రికని జగన్ గొప్పలు చెబుతారు కదా? అలాంటిది సుమారు 66 లక్షల మంది లబ్ధిదారుల్ని, అందులోనూ సగానికిపైగా ఉన్న వృద్ధుల్ని మండే ఎండల్లో మొదట సచివాలయాలకు, ఇప్పుడు బ్యాంకులకు వెళ్లి పింఛన్లు తెచ్చుకోవాలని సీఎస్ చెబుతుంటే జగన్ ఎందుకు నోరు విప్పడం లేదు?
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జగన్ కొత్త విధాన నిర్ణయాలు తీసుకోలేరేమో గానీ, ఉన్న విధానాల్ని కొనసాగించేందుకు, సమీక్షించేందుకు ఎలాంటి ఇబ్బందీ లేదే..! మరి ఆయనే ప్రవేశపెట్టిన, ఐదేళ్లుగా అమల్లో ఉన్న ఇంటింటికీ పింఛన్ల పంపిణీ విధానాన్ని కొనసాగించాలని సీఎస్‌ను ఎందుకు ఆదేశించడం లేదు? అలా ఆదేశించడం ఆయనకు ఇష్టం లేదా? ఆయన మౌనం వెనుక కారణమేంటి? బ్యాంకుల్లో తగిన సదుపాయాలు ఉండవని ఆయనకు తెలీదా? ఐదేళ్లలో లబ్ధిదారుల కోసం 130 సార్లు బటన్ నొక్కానని గొప్పలు చెప్పే జగన్… అత్యంత కీలకమైన సమయంలో ‘సీఎస్’ అన్న బటన్ ఎందుకు నొక్కడం లేదు? అసలు రాష్ట్రంలో పింఛన్ల సమస్య అనేది ఒకటి ఉందన్నట్లు ఎందుకు వ్యవహరించడం లేదు? ఉద్ధృతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటూ, అన్ని అంశాలపైనా మాట్లాడుతూ, సిద్ధం.. సిద్ధం అంటూ గొంతు చించుకుంటున్న జగన్… పింఛన్లపై మాత్రం మాట్లాడకపోవడంతో ఆయన వ్యవహారశైలిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన మౌనం వెనుక ఏదైనా కుట్ర ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరింత లోతుగా తరచి చూస్తే అవే నిజమనిపిస్తున్నాయి! ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా… మండుటెండల్లో వృద్ధుల్ని సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిప్పి… ఎండలవేడి తాళలేక వారు ఇబ్బంది పడితేనో, ఏదైనా ఉపద్రవం జరిగితేనో ఆ నెపాన్ని ప్రతిపక్షంపై నెట్టేసే కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది!
source : eenadu.net
Discussion about this post