గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. వెంటనే అక్కడకు వచ్చినవారు భజన మొదలుపెట్టారు. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం యర్రగుంట్లలో సీఎం జగన్ ప్రజలతో ‘ముఖాముఖి’ కాస్తా.. భ‘జన’సభగా మారింది. మాట్లాడినవారంతా జగన్‌పై పొగడ్తలతోనే సరిపెట్టారు. ఎర్రగుంట్లలో గురువారం నిర్వహించిన సమావేశం మొత్తం సీఎంను పొగుడుతూ, ప్రభుత్వ పథకాలతో తమ జీవితాలు పూర్తిగా మారిపోయినట్లు మాట్లాడించారు. ఐప్యాక్ సభ్యుల ఆధ్వర్యంలో ముందే పలువురు లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చారు. కొందరు మాట్లాడిన తీరు చూస్తే… బట్టీకొట్టి వచ్చినట్లు అర్థమవుతుంది. కార్యక్రమానికి వచ్చేవారిపై కఠిన ఆంక్షలు విధించారు. పాస్ ఉన్నవారు తప్ప వేరెవ్వరూ రాకుండా ఏర్పాట్లు చేశారు. పాస్‌లు ఉన్నవారిపైనా సెల్‌ఫోన్లు, పెన్నులు, చేతిరుమాలు, మంచినీటి సీసాలు, పుస్తకాలు తీసుకెళ్లనివ్వకుండా ఆంక్షలు విధించారు.
మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించకుండా కార్యక్రమం గుట్టుగా నిర్వహించారు. ప్రాంగణం మొత్తానికి పరదాలు కట్టేశారు. లోపల ఉన్నవారికి తప్ప బయట ఉన్నవారికి కార్యక్రమం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ యర్రగుంట్లలో 1,496 ఇళ్లు ఉండగా అందులో 1,391 ఇళ్ల వారికి ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరిందని చెప్పారు. అన్ని పథకాలద్వారా రూ.48.74 కోట్ల ప్రయోజనం కలిగిందన్నారు. తర్వాత ప్రజలతో సీఎం ముఖాముఖి ప్రారంభమైంది. తన కుమార్తెకు కళ్లు కనిపించవని, పింఛను అందట్లేదని సీఎం సమక్షంలో ఒకరు రోదించగా.. కారణాలు కనుక్కొంటానని సమాధానమిచ్చారు.
నంద్యాల సభకు జనాల్ని తరలించేందుకు కర్నూలు జిల్లాలోని వందల ఆర్టీసీ బస్సులతోపాటు తిరుపతి, చిత్తూరు, అలిపిరి, ప్రొద్దుటూరు, కడప, అనంతపురం తదితర సుదూర ప్రాంతాల్లోని బస్సులనూ తీసుకొచ్చారు. దీంతో రాయలసీమలోని పలు ప్రాంతాలకు చెందిన వేలమంది ప్రయాణికుల బస్టాండ్లలో నిరీక్షిస్తూ నరకం అనుభవించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వెచ్చించే ప్రతి పైసాకు లెక్కచూపాలి. ఆ స్పృహ లేకుండా వేల బస్సులను జనాల తరలింపునకు ఉపయోగించారు. అన్నిచోట్లా భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు.
source : eenadu.net
Discussion about this post