రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు జమ చేయాలని సర్పంచులు చేస్తున్న ఆందోళన అసెంబ్లీని తాకింది. పోలీసు వ్యూహాలను, వలయాన్ని ఛేదించుకుని సర్పంచులు భారీగా తరలివచ్చి మంగళవారం అసెంబ్లీ ఎదుట నిరసనకు దిగారు. పటిష్ఠ భద్రతను దాటి అసెంబ్లీ లోపలకు వెళ్లేందుకు వారు చేసిన ప్రయత్నాలు ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతపరిచాయి. వారిని పోలీసులు చివరి క్షణంలో అడ్డుకున్నారు. సర్పంచులు, పోలీసుల మధ్య తోపులాట, ఘర్షణ వాతావరణం ఏర్పడి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సర్పంచులను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించి సమీప స్టేషన్లకు తరలించారు. మొత్తం 220 మందిని వేర్వేరు చోట్ల అరెస్టు చేశారు.
ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, ఏపీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమై జిల్లాలనుంచి సర్పంచులు విజయవాడకు రాకుండా రెండు రోజులుగా ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. పోలీసు చర్యలను గమనించిన పలువురు సర్పంచులు వ్యూహాత్మకంగా ముందే విజయవాడకు చేరుకున్నారు. వారు మూడు బృందాలుగా విడిపోయారు. అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికే పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీముత్యాలరావు, పి.రమేశ్ తదితరులతో కూడిన మొదటి బృందం ఒక్కసారిగా అసెంబ్లీ వైపునకు దూసుకెళ్లింది. పోలీసులు అప్రమత్తమయ్యేలోగానే అసెంబ్లీ ప్రధానగేటు వద్దకు చేరుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో సర్పంచులు గేటు ముందు బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన నిధులు తిరిగి ఇప్పించాలని కొందరు సర్పంచులు ఏకంగా పోలీసుల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. అక్కడున్న వారిని పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించి నల్లపాడు స్టేషన్‌కు తరలించారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ను కృష్ణా జిల్లా ఉయ్యూరులోని ఆయన ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తెదేపా వర్గాలు, పోలీసుల మధ్య అరగంటపాటు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆదివారం రాత్రి నుంచి వైవీబీని గృహనిర్బంధం చేసి పోలీసులు బందోబస్తు చేపట్టారు. వారి చర్యలను నిరసిస్తూ వైవీబీ తన అనుచరులతో ఇంటి ప్రాంగణంలోనే బైఠాయించారు. సీఎంకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తూ టైర్లు తగులబెట్టారు.
source : eenadu.net
Discussion about this post