సకల సౌకర్యాలతో కూడిన ఇళ్లను త్వరలో అక్కచెల్లెమ్మలకు అప్పగించనున్నట్లు టిడ్కో రాష్ట్ర చైర్మన్ జమాన ప్రసన్నకుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే తనయుడు కేతిరెడ్డి సాయిప్రతాప్ రెడ్డితో కలిసి పట్టణంలోని టిడ్కో ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,43,600 ఇళ్లు అందజేస్తున్నామన్నారు. తాడిపత్రిలో 1,024 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఫిబ్రవరి రెండో వారంలో మొదటి విడతగా 308 గృహాలను లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. గత ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన మాటను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారన్నారు. రిజిస్ట్రేషన్ చేసి రూ. 12 లక్షల ఆస్తిని అక్కచెల్లెమ్మలకు అందజేస్తున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వం మహిళల నుంచి డబ్బు లాగడమే కాకుండా నిర్మాణాల పేరిట మభ్యపెట్టిందని విమర్శించారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని దాదాపు 3 కిలోమీటర్ల తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు చేస్తుండడం అభినందనీయమన్నారు. ఈ ప్రాంతంలో మరో 6 వేల ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం గర్వకారణమన్నారు. టిడ్కో ఇళ్ల సమీపంలో ప్రభుత్వం దాదాపు రూ. 1.50 కోట్లతో మహిళామార్ట్‌ను ఏర్పాటు చేస్తోందని, మార్కెట్ రేటుకంటే దాదాపు 25 శాతం తక్కువకు మార్ట్‌లో సరుకులు లభిస్తాయని చెప్పారు. ఇప్పటికే శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్‌లు విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ రాజశేఖర్, ఈఈ మల్లిఖార్జున, డీఈ సాలన్న, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు ఆలూరు రామేశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
source: sakshi.com
Discussion about this post