ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి మళ్లీ పుట్టపర్తి టికెట్ ఇస్తే ఓటమి తప్పదని వైకాపా అసమ్మతి నాయకులు హెచ్చరికలు చేశారు. కొత్తచెరువుకు చెందిన వైకాపా యువ నాయకుడు సాలమ్మగారి శివ వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేను వ్యతిరేకించే ద్వితీయ శ్రేణి నాయకులు హాజరయ్యారు. మండలంలో ఎమ్మెల్యే పాదయాత్ర కొనసాగుతుండగా అసమ్మతి నాయకుల సమావేశమవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా అసమ్మతి నాయకులు మాట్లాడుతూ శ్రీధర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి పార్టీకోసం పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోలేదని ఆరోపించారు. సొంత వ్యాపారాలు చూసుకుంటూ పార్టీ బాధ్యతలు పీఏలకు అప్పగించడంతో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులకు పార్టీని అప్పగించడంతో కార్యకర్తలకు తీరని నష్టం జరిగిందన్నారు. పీఏ డబ్బు ఇచ్చిన వారికి పనులు చేసిపెట్టడం బహిరంగ రహస్యమన్నారు. ఎమ్మెల్యే వైఖరితో నియోజకవర్గంలో వందలాది బాధితులు ఉన్నారన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలోని పరిస్థితులను గుర్తించి ఎమ్మెల్యేకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. లేదంటే శ్రీధర్‌రెడ్డిని ఓడిస్తామని హెచ్చరికలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ సర్పంచులు, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.
source : eenadu.net










Discussion about this post