2024 ఎన్నికల్లో జగన్ శవాల కోసం వెతుకున్నారు.. పండుటాకులను చంపి రాజకీయాలు చేస్తున్నారు. జగన్.. నీకు చేతనైతే ఎవర్నీ చంపకుండా పింఛన్లు ఇవ్వు. చేతకాకపోతే దిగిపో.. గంటలో పింఛన్లు పంపిణీ చేయించి చూపిస్తా. ఒకవేళ నువ్వు పింఛన్లు ఇవ్వకపోతే.. నేనొచ్చాక రూ.4 వేల పింఛను ఇంటివద్దనే ఇస్తానని చెప్పగానే భయపడి నిన్న డబ్బులు విడుదల చేశారు.. తప్పుచేస్తే నిలదీస్తా.. ఇంకా తప్పుచేస్తే ప్రజా సహకారంతో భూస్థాపితం చేస్తామే తప్ప వదిలిపెట్టం.
‘‘వైకాపా డీఎన్‌ఏలోనే శవ రాజకీయం ఉంది.. ఎవరైనా మంచిపని చేసి ఓట్లు అడుగుతారు. మనుషుల్ని చంపేసి.. ఎదుటివారిపైకి నెట్టి ఓట్లు అడిగే వ్యక్తి జగన్. 2014లో తండ్రి లేని బిడ్డనని ఓట్లడిగారు. మీరు అప్పుడు నమ్మలేదు.. అనుభవజ్ఞ్ఞుడినని నాకు ఓటేశారు. 2019లో కోడికత్తి డ్రామా.. తర్వాత బాబాయ్‌పై గొడ్డలివేటు.. ఇప్పుడు 2024 ఎన్నికల్లో పింఛన్లు పొందే వృద్ధులతో రాజకీయాలు చేస్తున్నారు. వైకాపాకు ఓటేయొద్దని జగన్ చెల్లి చెబుతున్నారు.. హత్యలు చేసేవాళ్లు కావాలా.. మీరే ఆలోచించుకోండి’’
చంద్రబాబు
‘‘రాజకీయ గాలి మారుతోంది.. జనం ట్రెండు మారింది.. జగన్ బెండు తీయడం ఖాయం.. నిర్ణయం అయిపోయింది.. వైకాపాను ఇంటికి పంపేయడానికి అందరూ సిద్ధమా..?’’ అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో గురువారం సాయంత్రం నిర్వహించిన ప్రజాగళం రోడ్‌షో, బహిరంగసభలో ఆయన మాట్లాడారు. మే 13న రెండు బటన్లు నొక్కి వైకాపాను బంగాళాఖాతంలో కలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోందన్నారు.
వాలంటీర్లూ.. వైకాపాకు వంతపాడొద్దు
‘‘వాలంటీరు వ్యవస్థకు నేను వ్యతిరేకం కాను. ప్రజాధనం నుంచి రూ.5వేల జీతం తీసుకుని వైకాపాకు పనిచేయడం న్యాయమా..? వాలంటీర్లను తొలగించం.. మీరు ఉంటారు.. వ్యవస్థను కొనసాగిస్తాం.. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించండి. ఏ పార్టీకి సేవలు చేయొద్దు’’ అని చంద్రబాబు అన్నారు.
పురందేశ్వరిని దిల్లీకి పంపాల్సిన బాధ్యత మీదే..
‘‘భాజపా అభ్యర్థిగాపురందేశ్వరి వస్తున్నారు.. కొవ్వూరు తెదేపా అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఒక బటన్ సైకిల్‌పై, రెండో బటన్ కమలం గుర్తుపై నొక్కండి. పురందేశ్వరిని దిల్లీకి పంపించాల్సిన బాధ్యత మీ అందరిపైనా ఉంది’’ అని చంద్రబాబు అన్నారు.
‘‘జగన్ ఇచ్చే సెంటుభూమిలో కంపుకొట్టే అవినీతి ఉంది. నేనొస్తా.. రెండు సెంట్ల భూమి ఇచ్చి, ఇళ్లు కట్టించి మీ రుణం తీర్చుకుంటా. టిడ్కో ఇళ్లూ అప్పగిస్తా. 50 ఏళ్లకే వెనుకబడిన వర్గాలకు పింఛను ఇచ్చే విధానం తెస్తా’’ అని హామీలు ఇచ్చారు. బహిరంగసభలో కొవ్వూరు అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్‌ఛార్జి టీవీ రామారావు, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధాకృష్ణ, తాడిమళ్ల విజయవాణి తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post