వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 12వ జాబితా విడుదల చేసింది. రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను ప్రకటిస్తూ మంగళవారం సాయంత్రం వైసీపీ అధిష్టానం ఒక ప్రకటన విడుదల చేసింది. చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం సమన్వకర్తగా కావటి మనోహర్ నాయుడు, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది.
ఏపీ సీఎం, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వీరిని ఎంపిక చేశారు. మరోవైపు, కర్నూలు మేయర్‌గా సత్యనారాయణమ్మను ఎంపిక చేశారు. బీవీ రామయ్యను కర్నూలు పార్లమెంట్ ఇంఛార్జీగా ప్రకటించడంతో కర్నూలు మేయర్‌గా సత్యనారాయణమ్మను నియమించారు.
కాగా, ఇప్పటి వరకు విడుదలైన 11 జాబితాలలో 75 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జీలను నియమించింది వైసీపీ. మొత్తం 175 సీట్లకు 175 సీట్లు మనమే గెలవాలని.. ఆ ప్రయత్నం చేద్దామని ఇప్పటికే వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే.. పార్టీ బలంగా ఉండటం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తామని నేతలకు జగన్ స్పష్టం చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి తెలియజేయాలని శ్రేణులకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా అధికార వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రంలో ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీల పనితీరుపై పలు సంస్థలతో సర్వేలు నిర్వహించారు. వాటి ఫలితాల ఆధారంగా అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తున్నారు
Discussion about this post