ఎన్నికల సమయంలో శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి మహ్మద్ ఇక్బాల్ శుక్రవారం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌కు లేఖను పంపారు. శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తూ శాసనమండలి చైర్మన్‌కు పంపిన లేఖలోనూ వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లుగా ఇక్బాల్ పేర్కొన్నారు. కాగా, పోలీసు అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో పేరున్న షేక్ మహ్మద్ ఇక్బాల్‌ను 2019 ఎన్నికల్లో వైసీపీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దించింది. ఎన్నికలకు కొన్నిరోజుల ముందే ఆయన పార్టీలోకి వచ్చినా.. పురంలో మైనార్టీ సామాజికవర్గం బలంగా ఉండటంతో మంచి ఓట్లు సాధించారు. కానీ టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. గత జూలైలో ఆయనకు సమాచారం ఇవ్వకుండా దీపికను హిందూపురం ఇన్‌చార్జిగా నియమించారు. అప్పటి నుంచి ఆయన అసమ్మతితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు ఈసారి ఎమ్మెల్యే టికెట్ లభించలేదు. ఇక పార్టీలో ఉండి ప్రయోజనం లేదని భావించిన ఇక్బాల్.. ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఇక్బాల్ త్వరలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు తెలిసింది. ఈ నెల 10న చేరిక దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం.
source : andhrajyothi.com
Discussion about this post