‘వైకాపా ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. అధికారాన్ని వాడుకుని జగన్ హంతకులను రక్షిస్తున్నారు. అవినాష్‌రెడ్డిని ఈ విషయంలో వెనకేసుకు రావడమే కాకుండా మళ్లీ ఆయనకే లోక్‌సభ టికెట్ ఇవ్వడం ఎలాంటి సంకేతాలిస్తుంది’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డిని హత్య చేసిన అవినాష్‌రెడ్డి పార్లమెంటు మెట్లు ఎక్కకూడదన్న ఉద్దేశంతోనే తాను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజన్న బిడ్డగా కడప లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్నానని ఆమె అన్నారు. వైయస్‌ఆర్ జిల్లా ఇడుపులపాయలో మంగళవారం తల్లి విజయమ్మ, కుమార్తె అంజలిరెడ్డితో కలిసి ఆమె తన తండ్రి రాజశేఖరరెడ్డి ఘాట్‌ను సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల జాబితాను వైయస్ సమాధిపై ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, మాజీ ఎంపీ తులసిరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కడప లోక్‌సభ అభ్యర్థిగా రాజశేఖరరెడ్డి బిడ్డ పోటీ పడుతోందని, ఈ నిర్ణయం అంతా సులువైనది కాదని, ఇది తన కుటుంబాన్ని చీల్చడమే కాకుండా రాజన్న అభిమానులను గందరగోళంలో పడేస్తోందనే విషయం తెలుసునని వివరించారు. తప్పనిసరి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు. సాక్ష్యాధారాలు ఉన్నా వివేకా హంతకులు నేటికీ తప్పించుకుని తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు నువ్వు నా చెల్లివి కాదు.. నా బిడ్డ అన్న జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సీఎంతో తనకు ఎలాంటి పరిచయమూ లేదని ఎద్దేవా చేశారు. వివేకాను దారుణంగా హత్య చేస్తే గుండెపోటుగా చిత్రీకరించి సాక్షి ఛానల్‌లో తప్పుడు కథనాలు ప్రసారం చేశారన్నారు. ఈ హత్యను రాజకీయం కోసం వాడుకున్నట్లుగా ఆలస్యంగా అర్థమైందన్నారు. వివేకాను హత్య చేసిన వారికే ఎంపీ సీటు ఇస్తే ప్రజలు హర్షించరని తెలిసి కూడా అహంకారంతో మళ్లీ ఆయనకే టికెట్ ఇవ్వడంపై ధ్వజమెత్తారు. సునీత న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నా కనికరం లేకుండా ఆమెపైనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజన్న బిడ్డగా తాను ఏం చేయాలో ఆలోచించానని, హత్యా రాజకీయాలను తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. తనను ఎంపీగా వివేకా ఎందుకు చూడాలనుకున్నారో అప్పట్లో అర్థం కాలేదని, సంఘటన జరిగిన అనంతరం ఇప్పుడు అర్థమైందన్నారు. తన చిన్నాన్న వివేకాను గుర్తు చేసుకున్న ప్రతిసారి ఆమె కంటతడి పెట్టారు. వైఎస్‌ఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తానని షర్మిల అన్నారు. తన తండ్రి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఎన్నికల్లోనూ గెలిచారని, ఎదిగి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారన్నారు. ఆయన బతికి ఉంటే రాహుల్‌గాంధీని ప్రధానిగా చేసి తన కలను సాకారం చేసుకునేవారని పేర్కొన్నారు.
source : eenadu.net
Discussion about this post