కణేకల్లు మండలానికి చెందిన వాలంటీరు తిప్పేస్వామి కార్యకర్తల్లాగా వైకాపా అభ్యర్థి తరఫున ఆ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిత్రం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి తనయుడు మెట్టు విశ్వనాథరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని బిదురుకుంతం, మీనహళ్లి గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ శుక్రవారం ‘గడప, గడపకు మెట్టు’ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని కణేకల్లు మేజరు పంచాయతీకి చెందిన వాలంటీరు తిప్పేస్వామి ఏకంగా వైకాపా కండువా ధరించి కార్యకర్తలాగా పాల్గొనడం చర్చనీయాంశమైంది. గ్రామ సచివాలయ ఉద్యోగి విశ్వనాథరెడ్డి (గ్రామ సర్వేయర్)తోపాటు వాలంటీరు రాయదుర్గంలోని మెట్టు గోవిందరెడ్డి నివాసంలో వైకాపా నాయకులతో కలిసి ఉన్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. దీనిపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని తెదేపా వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
source : eenadu.net
Discussion about this post