పోలీసులు ప్రజల నేస్తాలు.. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఉద్యోగం చేయాలని ఉన్నతాధికారులు సమీక్షల్లో మాత్రమే ఊదరగొడుతున్నారు. ఆచరణలో గాలికి వదిలేస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ.. స్వామిభక్తిని ప్రదర్శిస్తున్నారు. వారి మాట వేదవాక్కుగా.. వారు చెప్పిన వారిపై కేసులు బనాయిస్తూ తెదేపా నాయకులు, కార్యకర్తల్లో భయాన్ని సృష్టిస్తున్నారు. జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి మొదలు.. వైకాపా నాయకుల వద్ద కొందరు పోలీసులు కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పోలీసులు సాధారణ కేసులను పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేసి వాటిపై అక్కడికక్కడే చర్యలు తీసుకుంటున్నారు. ఇక రాజకీయానికి సంబంధించిన ఏ కేసులనైనా అధికార పార్టీ సూచనల మేరకే పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. కేసులంటే కేసులు.. లేదా అరెస్టు చేయాలంటే వాటికి అనుకూలంగా కేసులు మలుస్తున్నట్లు తెలుస్తోంది. వారు చెబితే చివరికి రౌడీషీట్లు తెరిచేందుకు కూడా పోలీసులు వెనకాడటం లేదు.
వైకాపా నాయకులు దౌర్జన్యం చేసినా..
వైకాపా నేతలు దౌర్జన్యాలు చేసినా.. పోలీసులు తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వాటికి నిదర్శనమే.. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటనలో వైకాపా శ్రేణులు రెచ్చిపోయారు. పోలీసుల సమక్షంలోనే తెదేపా నేతలను రెచ్చగొట్టి బీభత్సం సృష్టించారు. అక్కడ గొడవలు జరగడానికి వైకాపా నేతలే కారణమైనా.. వారిపై పోలీసులు సాధారణ కేసులు పెట్టారు. తెదేపా నాయకులపై హత్యాయత్నం తదితర కేసులు పెట్టి అరెస్టు చేశారు. అంతే కాకుండా కొన్ని రోజుల కిందట శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన రామకృష్ణ, రామసూరి, ఆదినారాయణ, సుందరరావు, రమేష్‌లు కలిసి చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ యాత్రగా వచ్చారు. వారిని పుంగనూరులోని సుగాలిమిట్ట వద్ద వైకాపా నాయకులు అడ్డుకున్నారు. దుర్భాషలాడుతూ వారి చొక్కా విప్పించి దాడి చేశారు. ఇంత జరిగినా పోలీసులు వారిపై బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
నేరం రుజువు కాకుండానే..
పోలీసు అధికారులు తెదేపా నేతలంటేనే కేసులు పెట్టడానికి వాటిని రౌడీషీట్లుగా మలచడానికి తహతహలాడుతున్నారు. నిజానికి ఓ వ్యక్తిపై రౌడీషీటు తెరవాలంటే కనీసం ఒక నేరం చేసుండాలి. ఆ కేసులో నేరం రుజువై ఉండాలి. అతని ద్వారా ప్రజాశాంతికి భంగం వాటిల్లేలా ఉందంటూ సదరు వ్యక్తి అదేలా వ్యవహరిస్తుంటే అప్పుడు రౌడీషీట్ తెరవాల్సి ఉంటుంది. అయితే.. పోలీసులు వాటికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పుంగనూరు అల్లర్ల ఘటనలో తెదేపా నాయకులపై అక్రమ కేసులు పెట్టగా.. సదరు కేసు విచారణ దశలో ఉన్న సమయంలోనే సుమారు 30 మందిపై రౌడీషీటు తెరవడం గమనార్హం. ఇప్పుడే ఇలా ఉంటే.. మున్ముందు పోలీసులు ఎలా వ్యవహరిస్తారోనని తెదేపా నాయకులే కాకుండా ప్రజలు కూడా భయందోళనకు గురవుతున్నారు.
source : eenadu.net
Discussion about this post