కడప నియోజకవర్గంలో వైకాపా నాయకులు ఏర్పాటు చేస్తున్న వివిధ సభలు, సమావేశాలకు హాజరయ్యే కార్పొరేటర్ల సంఖ్య తగ్గడం అధికార పార్టీ నాయకులను కలవర పెడుతోంది. కడప నగరపాలక సంస్థలో వైకాపాకు 49 మంది కార్పొరేటర్లు ఉండగా, శనివారం జరిగిన ‘సిద్ధం’ సమావేశానికి సుమారు 30 మంది మాత్రమే హాజరైనట్లు తెలిసింది. హాజరైన వారిలో కొందరు మొక్కుబడిగా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సమావేశానికి హాజరు కాని కార్పొరేటర్లపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. అంతకుముందు జరిగిన ఆసరా, పట్టాల పంపిణీ సమావేశాలకు కూడా కార్పొరేటర్లు పెద్దగా హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. డివిజన్ స్థాయిలో తమకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని కార్పొరేటర్లు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినా నాయకులు ఎలాంటి సాయం అందించలేదని కొందరు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. నామినేటెడ్ పదవులు ఇప్పించడంలో వైకాపా అగ్రనాయకులు తమకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని మరి కొందరు గుర్రుగా ఉన్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటామని, అనంతరం సచివాలయాల్లో అడుగుపెట్టబోమని ఆ పార్టీ కార్పొరేటర్లు సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు. పార్టీ కార్పొరేటర్ల అసంతృప్తిని చల్లబరిచేందుకు అగ్రనాయకులు ఏర్పాటు చేసిన విందుసమావేశాలు బెడిసికొట్టాయి. ఈ నేపథ్యంలో దాదాపు 18 మంది కార్పొరేటర్లు తెదేపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో కొనసాగింది. దీనిపై ఆ పార్టీ అధ్యక్షుడే నేరుగా స్పందించి తమ పార్టీ కార్పొరేటర్లు ఎవరూ పార్టీ మారరని చెపాల్సి వచ్చింది. ఈ అంశంపై మెజార్టీ కార్పొరేటర్లు ఎలాంటి ప్రకటన చేయ కుండా మౌనంగా ఉండడం వైకాపా నాయకులను కలవరపెడుతోంది. ఆ పార్టీ కార్పొరేటర్లు ఉన్నఫళంగా తెదేపాలో చేరకపోయినా నిస్తేజమయ్యారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. అనంతపురంలో జరగబోయే వైకాపా ‘సిద్ధం’ బహిరంగ సభను వైకాపా శ్రేణులు విజయవంతం చేయాలని ఉపమఖ్యమంత్రి అంజాద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్, నగర అధ్యక్షుడు సుబ్బారెడ్డి శనివారం ఓ కల్యాణమండపంలో జరిగిన సమావేశంలో పిలుపునిచ్చారు.
source : eenadu.net
Discussion about this post