గ్రామ వాలంటీర్లు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఆదేశాలు ఇచ్చినా వారు పట్టించుకోవడంలేదు. అనంతపురం జిల్లా విడపనకల్లులో మంగళవారం జరిగిన వైకాపా ఆవిర్భావ దినోత్సవంలో మండలానికి చెందిన పలువురు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. వారిలో విడపనకల్లు, గడేకల్లుకు చెందిన వాలంటీర్లు హేమంత్, బసవరాజు, సురేశ్, మహేశ్, కొల్లాపుర, భీమరాజు, ఎండీయూ ఆపరేటర్ చంద్ర ఉన్నారు. వారితో కలిసి ఒక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు తెలిసింది.
మండలంలోని సొల్లాపురంలో మంగళవారం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి తనయుడు విశ్వనాథరెడ్డి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వాలంటీర్లు శ్రీనాథ్, రాజశేఖర్ వైకాపా కండువాలు ధరించి కరపత్రాలు చేతపట్టుకొని ప్రచారంలో పాల్గొన్నారు. అధికారులు స్పందించి వాలంటీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు.
source : eenadu.net
Discussion about this post