ప్రజలను వేధిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని ఓటుతో ఇంటికి సాగనంపాలని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లో పర్యటించారు. అప్పట్లో చంద్రబాబు అరెస్టును చూసి తట్టుకోలేక హిందూపురం పట్టణం శ్రీకంఠపురానికి చెందిన తెదేపా కార్యకర్త అంజినప్ప, మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం దిన్నేహట్టి గ్రామానికి చెందిన ముత్తప్ప మృతిచెందారు. బాధిత కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి, ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చేయని నేరానికి చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం.. తెదేపా కార్యకర్తలను కొట్టడం, తప్పుడు కేసులు నమోదు చేసి జైల్లో పెడుతోందని విమర్శించారు. కార్యకర్తలు దీన్ని ఏ మాత్రం లెక్క చేయొద్దని ప్రతి ఒక్కరికీ మేం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు గెలవాల్సిన అవసరం ఉందన్నారు.
source : eenadu.net
Discussion about this post