చిత్తూరు నియోజకవర్గంలో అధికార వైకాపాకు ఆదివారం ఒకేసారి రెండు షాక్‌లు తగిలాయి. ప్రస్తుత ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం హైదరాబాద్‌లో జనసేన పార్టీ అధినేతను కలిశారు. పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన ఆయన మూడు- నాలుగు రోజుల్లో అధికారికంగా ఆ పార్టీలో చేరుతానని స్పష్టం చేసి వైకాపాకు ఝలక్ ఇచ్చారు. ఆ వెంటనే ఆరణి శ్రీనివాసులును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.
అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల ప్రకటన తర్వాత ఎమ్మెల్యే శ్రీనివాసులు కొంతకాలం మౌనంగా ఉండిపోయారు. విజయానందరెడ్డి అభ్యర్థిత్వాన్ని అంగీకరించేదిలేదని పలుమార్లు వైకాపా పెద్దలకు చెప్పారు. ఆయన్ను మార్చి మరొకరికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే సహకరిస్తానని చెప్పినా ఆరణి మాటకు అధిష్ఠానం విలువ ఇవ్వలేదు. ఇన్‌ఛార్జుల ప్రకటన సమయంలో రాజ్యసభ సీటును ఆరణికి ఇస్తామని ఆశపెట్టి.. ఆ తర్వాత మొండిచేయి చూపారు. దీంతో ఆయన స్తబ్దుగా ఉండిపోయారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం, పదేపదే అవమానాలు ఎదురవ్వడంపై తరచూ అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారాలని ఎమ్మెల్యేపై వారు ఒత్తిడి చేసినా వేచిచూశారు. ఇదే సమయంలో క్రియాశీలకంగా పనిచేయడం తగ్గించారు. ఇటీవల సీఎం జగన్ శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లికి వచ్చినప్పుడు సైతం ఎమ్మెల్యే హాజరుకాలేదు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకూ గైర్హాజరవుతున్నారు. తాజాగా జనసేన అధినేతను కలవడంతో రాజకీయాలు కొత్తదారి తొక్కాయి. వైకాపాలో తనకు అన్యాయం జరిగిందంటూ ఎమ్మెల్యే శ్రీనివాసులు చెప్పడం గమనార్హం. రానున్న రోజుల్లో తెదేపా అభ్యర్థి జగన్మోహన్‌ను గెలిపించేందుకు ప్రచారంలోకి దూకనున్నారు.
మాజీ ఎమ్మెల్యే సీకే జయచంద్రారెడ్డి (సీకే బాబు) తన రాజకీయ నిర్ణయాన్ని ఆదివారమే ప్రకటించారు. 1989లో స్వతంత్ర అభ్యర్థిగా, 1994, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించి.. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు సాధించారు. 2004 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా, 2009లో గెలుపొందారు. దాదాపు పదేళ్లు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన తన అనుచరులతో ఆదివారం భేటీ అవ్వడంతో ఉత్కంఠ నెలకొంది. తెదేపా, వైకాపాకు సమదూరం పాటిస్తారని కొందరు భావించారు. ఇది ఎంతోకొంత తమకు మేలు చేస్తుందని ఫ్యాన్ పార్టీ నాయకులు లెక్కలు వేసుకున్నా సీకే బాబు సైకిల్ పార్టీకే జై కొట్టారు. అభిమానులు, అనుచరులతో జరిపిన సమావేశంలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశానికి, ఆ పార్టీ నుంచి బరిలోకి దిగే గురజాల జగన్మోహన్‌కు మద్దతు ఇస్తున్నానని చెప్పారు. తెదేపా కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇలా ఒకేరోజు సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు ప్రకటించిన నిర్ణయం అధికార పార్టీకి శరాఘాతమైంది.
source : eenadu.net
Discussion about this post