బాపట్ల జిల్లాలోని మేదరమీట్ల వద్ద సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లను వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇక, ఈ సభలోనే వైఎస్సార్‌సీపీ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..‘మేదరమీట్లలో సిద్ధం సభను ఈనెల పదో తేదీన నిర్వహిస్తున్నాం. ఈ సభలో నాలుగు సంవత్సరాల పదినెలల్లో మేము చేసిన అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన విషయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివరిస్తారు. ఈ సభలోనే వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తాం. గతంలో ఏం చేశాం.. రాబోయే కాలంలో ఏం చేస్తామో సీఎం జగన్ వివరిస్తారు.
ఈ సిద్దం సభకు 15లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. సిద్ధం సభలకు ప్రజల నుంచి స్పందన బాగా ఉంది. ఒక దానిని మించి ఇంకో సభకు ప్రజలు పోటెత్తుతున్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్సార్‌సీపీ ఏం చేసిందో ప్రజలకు బాగా తెలుసు. బీసీల కోసం పాటుపడిందెవరో బీసీలకు బాగా తెలుసు. సిద్ధం సభకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభను నిర్వహిస్తాం. మార్చి పదో తేదీ తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది’ అని కామెంట్స్ చేశారు.
source : sakshi.com
Discussion about this post