సామాజిక న్యాయపాలనకు ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమే మళ్లీ గెలుస్తుందని ప్రముఖ నటుడు సుమన్ స్పష్టం చేశారు. తన వీరాభిమాని బుజ్జమ్మ కుమార్తె వివాహం కోసం తిరుపతికి వచ్చిన ఆయన ఆదివారం తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు.
అనంతరం సుమన్‌ను ఆలయ చైర్మన్ కట్టా గోనీయాదవ్ శాలువతో సత్కరించి అమ్మవారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గంగమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేక ఏ పార్టీకైనా మద్దతు పలుకుతారా అని మీడియా ప్రశ్నించగా రాజకీయ పరంగా పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు సీనియర్ సిటిజన్స్‌కు ప్రాధాన్యత కల్పిస్తూ మేనిఫెస్టో అందించే పార్టీకి తన సంపూర్ణ సహకారం ఉంటుందని సుమన్ చెప్పారు.
రాజకీయం అంటే పదవులు చేపట్టడం కాదని, ప్రజల సంక్షేమం దిశగా ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజాదరణ పొందినప్పుడే ప్రజా నాయకులు అవుతారని, ఎంత కష్టమైనా ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల కోసం శ్రమించే వారికే పట్టం కడతారని పేర్కొన్నారు.
source : sakshi.com
Discussion about this post