అనంతపురం జిల్లా రాప్తాడులో వైకాపా సిద్ధం సభకు బస్సులు కావాలంటే.. ఆర్టీసీ పూర్తి సొమ్ము కూడా అడక్కుండా 13 జిల్లాల నుంచి 3వేల బస్సుల్ని కేటాయించింది. బాపట్ల జిల్లా మేదరమెట్లలో త్వరలో జరిగే సభకు కూడా మొత్తం పది వేల బస్సులూ ఇచ్చేస్తాం, అవసరమైతే ఆర్టీసీకి సెలవులు ప్రకటించేందుకు ‘సిద్ధం’ అంటోంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెదేపా-జనసేన ‘జెండా’ సభకు 150 బస్సులు కావాలని, వాటికి ముందే సొమ్ము చెల్లిస్తామని చెప్పినా కూడా నో బస్! ప్రైవేటు వాహనాలు, పాఠశాల బస్సుల్నీ సిద్ధం సభకు తరలిస్తూ తరిస్తున్న రవాణా శాఖ.. ప్రతిపక్ష పార్టీల సభలకు వెళ్లే వాహనాలపై కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతోంది.
ఏపీఎస్‌ఆర్‌టీసీ కాస్తా.. వైఎస్‌ఆర్‌టీసీగా మారిపోయింది. వైకాపా ఇంటి సంస్థలా, జగన్ సొంత ఆస్తిలా తయారైంది. ప్రయాణికుల అవసరాల కంటే ముఖ్యమంత్రి సభలు, సమావేశాలకు బస్సులివ్వడమే ప్రాధాన్యంగా భావిస్తోంది. సీఎం సభ ఉందంటే ఆ చుట్టుపక్కల జిల్లాల్లోని ప్రజలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం మానుకోవాల్సిందే. రాష్ట్రానికో రాజప్రాసాదం, బయటకెళ్లాలంటే వాహనాల వరుస, భద్రతకు ముప్పు పేరుతో రెండు హెలికాప్టర్లు సమకూర్చుకుని ఆకాశయానం చేసే జగన్.. సామాన్య జనానికి ఒకే ఒక్క ప్రయాణ సాధనమైన ఆర్టీసీ బస్సునూ అందకుండా చేస్తున్నారు. అధికారిక కార్యక్రమాలు, వైకాపా బహిరంగ సభలకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారని ప్రదర్శించుకునేందుకు ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ.. పేద, మధ్యతరగతి వర్గాలకు బస్సు ప్రయాణం మరింత దుర్లభంగా మారుతోంది. అవసరమైతే పెళ్లిళ్లకు కేటాయించిన వాటిని, పండగలకు పెట్టిన ప్రత్యేక బస్సుల్నీ అర్ధంతరంగా రద్దు చేసి మరీ సీఎం సభలకు మళ్లిస్తున్నారు. ఒక డిపోలో ఉండే మొత్తం బస్సుల్లో 80% వరకు తరలిస్తున్నారు. చివరకు తిరుమల ఘాట్ రోడ్డులో తిరిగే బస్సుల్నీ వదలడం లేదు. దీంతో ఆర్టీసీ బస్సునే నమ్ముకున్న బడిపిల్లలు, ఆర్టీసీ బస్సులో ప్రయాణం తమ భద్రతకు భరోసాగా భావించే మహిళలు, పోటీ పరీక్షలు రాసే నిరుద్యోగులు, ఉపాధి బాటలో రోజూ పట్టణాలకు వెళ్లే కార్మికులు.. ఇలా అన్ని వర్గాలకూ ఇబ్బందులు తప్పడం లేదు.
source : eenadu.net
Discussion about this post