పోలీసుల దాష్టీకం మరోసారి బయటపడింది. సీఎం జగన్‌పై రాయి విసిరిన కేసులో బాలలను వారు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని వడ్డెర కాలనీపై మంగళవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి తల్లిదండ్రులు చూస్తుండగానే పట్టుకెళ్లారు. విచారించి ఇప్పుడే పంపుతామంటూ మంగళవారం రాత్రి వరకూ వారి ఆచూకీ చెప్పలేదు. బాలల తల్లిదండ్రులు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. వారి రోదనలు మిన్నంటుతున్నాయి. అభంశుభం తెలియని పిల్లలను తీసుకెళ్లి వేధిస్తున్నారని వాపోతున్నారు. సీఎం జగన్ వస్తున్నప్పుడు వైకాపా జెండా పట్టుకుంటే రూ.200 ఇస్తామన్న మాయమాటలే తమను ఇంతలా మనోవ్యథకు గురిచేశాయని రోదిస్తున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం తెల్లవారుజామున ఎనిమిది మంది మైనర్లను అదుపులోకి తీసుకుంది. వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. సంఘటన స్థలానికి వడ్డెర కాలనీ కేవలం 400 మీటర్ల దూరంలోనే ఉంది. తమ పిల్లలను రెండు గంటల్లో వదిలిపెడతామని చెప్పి తీసుకెళ్లారని కాలనీవాసులు వివరిస్తున్నారు. వారంతా అమాయకులని, దాడితో సంబంధం లేదని, తక్షణమే విడిచిపెట్టాలని మంగళవారం సాయంత్రం డాబాకొట్ల రోడ్డును దిగ్బంధించి రాస్తారోకో చేశారు. కేసుకు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 200 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో సతీష్ ఒక్కరే మేజర్. సీఎంపై సతీష్ రాయి విసిరినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. జగన్‌పై దాడి జరిగిన రోజు పొద్దుపోయాక సతీష్ తన మిత్రులతో కలిసి జన్మదిన వేడుకలు చేసుకున్నాడు. వారు బైక్‌లపై చక్కర్లు కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. వారిపై అనుమానంతో మంగళవారం వేకువజామున కాలనీకి వచ్చి నిద్రపోతున్న వారిని బలవంతాన తీసుకెళ్లారు. పిల్లలు సొల్యూషన్ పీలుస్తున్నారని, విచారించి రెండు గంటల్లో వదిలిపెడతామని తల్లిదండ్రులకు చెప్పారు. అనంతరం తల్లిదండ్రులు ఆందోళనతో సింగ్‌నగర్ పోలీసుస్టేషన్‌కు, అక్కడినుంచి సీసీఎస్ స్టేషన్‌కు తరువాత కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. ఎక్కడాలేరని పోలీసులు చెప్పడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కాలనీవాసులు, పిల్లలు మట్టి, బేల్దారి పనులు చేస్తారు.
రూ.200 ఆశ చూపి తమను జగన్ బస్సు యాత్రకు తీసుకువెళ్లారని, ఆ డబ్బులూ ఇవ్వలేదని స్థానికులు వివరించారు. సంఘటన జరిగిన సమయంలో అసలు నగరంలో లేని ఇద్దరినీ పోలీసులు తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. తమపై వేధింపులు ఆపాలని లేని పక్షంలో జగన్ పేరు చెప్పి తామంతా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని కన్నీటి పర్యంతమయ్యారు. తమ పిల్లలకు ఏమీ తెలియదని, సంఘటన జరిగిన రోజు పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారని వివరించారు. జగన్ మామయ్య అని అభిమానించినందుకు మమ్మల్ని సీఎం నట్టేట ముంచారని పోలీసుల అదుపులో ఉన్న ఓ బాలుడి పిన్ని మండిపడ్డారు.
source : eenadu.net
Discussion about this post