‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అంటూ ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేసి, ఆ భూములను కొట్టేయాలని జగన్ చూస్తున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వమే ప్లాంట్ కొనుగోలు చేసి సంస్థను కాపాడేలా చర్యలు తీసుకుంటాం’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. తెదేపా విశాఖను ఉద్యోగాలకు రాజధానిగా చేస్తే, జగన్ గంజాయి రాజధానిగా చేశారని మండిపడ్డారు. తెదేపా శ్రేణులను ఎన్నికలకు కార్యోన్ముఖులను చేసేందుకు తలపెట్టిన ‘శంఖారావం’ కార్యక్రమాన్ని లోకేశ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆదివారం ప్రారంభించారు. తొలిరోజు ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో పర్యటించారు. తెదేపా, జనసేన శ్రేణులు భారీగా హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఉత్తరాంధ్ర నాయకులు పాల్గొన్నారు. ‘జగన్ తన పాదయాత్రలో శ్రీకాకుళం జిల్లాకు 60 హామీలు ఇచ్చారు. ఒక్కటీ నెరవేర్చలేదు. కొబ్బరి పార్కు, బీలబట్టి, మహేంద్ర తనయ, బాహుదా నదుల కాలువలను అభివృద్ధి చేస్తానన్నారు. వీటికి అయిదేళ్ల కాలం సరిపోలేదా? మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జీడి, కొబ్బరి రైతులు, మత్స్యకారులను ఆదుకుంటుంది. లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందజేసి, సామూహిక గృహ ప్రవేశాలు చేపడతాం. జగన్ నిలిపివేసిన సంక్షేమ పథకాలన్నీ రెండు నెలల్లో తిరిగి ప్రారంభిస్తామ’ని హామీ ఇచ్చారు. ‘సీఎం జగన్‌కు మైథోమానియా సిండ్రోమ్ ఉంది. ఈ సమస్య ఉన్నవారు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా చెప్పుకొంటారు. సొంత చెల్లెలు తనకు భద్రత లేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఇక మన ఆడపడుచులకు భద్రత ఎక్కడ? రాష్ట్రాన్ని ఎలా రక్షిస్తారు?’ అని లోకేశ్ అన్నారు.
బ్లూ బటన్‌తో ఇచ్చి.. రెడ్ బటన్‌తో నొక్కేసి..
‘జగన్‌కు సొంత టీవీ ఛానళ్లు, పత్రిక, సిమెంట్ పరిశ్రమలున్నాయి. రూ.లక్ష విలువ చేసే చెప్పులు వేసుకుంటారు. రూ.వెయ్యి ఖరీదు చేసే సీసా నీళ్లు తాగుతారు. అతనికి పేదల సమస్యలు అర్థంకావు. బ్లూ బటన్‌తో రూ.10 ఇచ్చి, రెడ్ బటన్‌తో రూ.100 నొక్కేస్తున్నారు. గత ఎన్నికల ముందు 23,000 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తానని చెప్పి, 6,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ పైనా మాట తప్పారు’ అని లోకేశ్ మండిపడ్డారు.
దేనికి సిద్ధం.. జగన్?
‘జగన్ ఇటీవల ‘సిద్ధం’ అంటున్నారు. దేనికి సిద్ధం? జైలుకు వెళ్లడానికా? బాబాయ్‌నే చంపేసిన మీరు.. ఇంకొంత మంది కుటుంబసభ్యులను లేపేయడానికా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికా? విశాఖలో భూకబ్జాలకు సహకరించలేదని తహసీల్దారు రమణయ్యను కిరాతకంగా చంపేశారు. బాపట్ల ఆర్‌బీకేలో వ్యవసాయ అధికారి పూజితను బలిగొన్నారు. బీసీ బిడ్డ అమర్‌నాథ్‌గౌడ్, దళిత బిడ్డ డాక్టర్ సుధాకర్, మైనారిటీ బాలిక మిస్బానీని హతమార్చిన జగన్‌ను ఇంటికి పంపించేందుకు ప్రజలే సిద్ధంగానే ఉన్నారు’ అని లోకేశ్ పేర్కొన్నారు.
source : eenau.net
Discussion about this post