‘మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య.. జగనాసుర రక్త చరిత్రే’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. త్వరలో వివేకా హత్య కేసు నిందితుల జాబితాలో జగన్ పేరు చేరే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో సోమవారం నిర్వహించిన శంఖారావం సభల్లో లోక్‌శ్ ప్రసంగిస్తూ సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఒక్కో క్వార్టర్ మద్యం సీసాపై జే ట్యాక్స్ కింద రూ.25 వసూలు చేస్తున్నారు.. ఇలా ఐదేళ్లలో రూ.45 వేల కోట్లు సీఎం జగన్ దోచేశారు. రాష్ట్రంలో ఇంటి పన్ను, చెత్త పన్ను అంటూ పన్ను వేయని రంగం లేదు. మళ్లీ అధికారంలోకి వస్తే ఇంట్లో కుక్కపైన, పీల్చేగాలిపైనా పన్ను వేస్తారు. ఇసుకలో కూడా పెద్దఎత్తున దోపిడీ చేస్తున్నారు. తెదేపా-జనసేన ప్రభుత్వం వచ్చాక ఇసుక ధరలు తగ్గిస్తాం’ అని హామీ ఇచ్చారు.
అక్రమ కేసులపై చర్చకు సిద్ధమా..?
‘చంద్రబాబును తప్పుడు కేసుల్లో ఇరికించి అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. తొలుత రూ.3 వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. తర్వాత రూ.270 కోట్లన్నారు, ఇప్పుడు రూ.27 కోట్లు అంటున్నారు. చంద్రబాబు ఏనాడు అవినీతి చేయలేదు. అవినీతిఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా’ అని సీఎం జగన్‌కు సవాల్ విసిరారు.
రైల్వే జోన్‌కు స్థలం ఇవ్వలేకపోయారు..
‘25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు. ప్రజలు నమ్మి అత్యధిక మంది ఎంపీలను గెలిపిస్తే.. ఇప్పుడు వారిని రాష్ట్ర ప్రయోజనాలకు కాకుండా జగన్ కేసుల మాఫీ చేసుకోవడం కోసం తాకట్టు పెట్టారు. ఇటీవల జగన్ దిల్లీ వెళ్తే సొంత ఎంపీలూ ముఖం చాటేశారు. ఎమ్మెల్యేలు సైతం బై బై జగన్ అంటూ వెళ్లిపోతున్నారు. రాష్ట్రానికి రైల్వేజోన్ మనం సాధిస్తే దానికి భూమి కూడా ఇవ్వలేకపోయారు’ అని ఎద్దేవాచేశారు.
source : eenadu.net
Discussion about this post