కొద్ది రోజులుగా సామాన్యులకు, వాలంటీర్లకు కానుకలు ఎరగా వేస్తున్న వైకాపా నాయకులు.. ఇప్పుడా జాబితాలో జర్నలిస్టులనూ చేర్చారు. పల్నాడు జిల్లాలోని అన్ని మండలాల్లో విలేకరులకు వైకాపా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు ఆత్మీయ సమావేశాల పేరిట విందు భోజనాలు ఏర్పాటుచేసి, కానుకల కిట్లు అందజేస్తున్నారు. వీటిలో చీర, ప్యాంటు, షర్టుతో పాటు కొందరు స్వీట్ బాక్స్, రైస్ కుక్కర్లు, టీ కప్పులు కూడా జత చేస్తున్నారు. సత్తెనపల్లి, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ ప్రలోభ పర్వాన్ని సీఎంవో నుంచి పర్యవేక్షిస్తుండటం గమనార్హం. ‘ఈ కిట్ ముఖ్యమంత్రి పేషీ నుంచి వచ్చింది’ అంటూ విలేకరులకు ఎమ్మెల్యేలు అందజేస్తుండగా ఫొటో తీసి, అప్‌లోడ్ చేస్తున్నట్లు తెలిసింది. బహుమతులు ఇచ్చేటప్పుడు, విందులో పాల్గొన్నప్పుడు విలేకరులెవరూ ఫొటోలు తీయకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఒక్కో చోట ఒక్కో తీరుగా..
మంత్రి అంబటి రాంబాబు ఈనెల 16న సత్తెనపల్లిలో ఆత్మీయ సమావేశం నిర్వహించి విలేకరులకు విందు ఇచ్చారు. ఆయనే స్వయంగా చీర, ప్యాంటు, షర్టు, జగన్ బొమ్మతో కూడిన టీ కప్పును ఓ సంచిలో పెట్టి అందజేశారు. ఈ ఫొటోలు మీడియాకూ పంపించారు. పొరపాట్లు ఏమైనా చేసుంటే పట్టించుకోవద్దని, ఇకపై తనకు సహకరించాలని, ఎన్నికల్లో తోడ్పాటు అందించాలని కోరారు.
వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు 18న విలేకరులకు ఆత్మీయ సమావేశం ఉంటుందని అందరికీ ఫోన్లు చేసి పిలిపించారు. రాజకీయాలపై మాట్లాడలేదు. భార్యాభర్తలు వస్తేనే గిఫ్ట్ బాక్స్ ఇస్తామని, రానివారికి కేవలం ప్యాంటు, షర్టులు ఇస్తామని, తర్వాత అయినా కుటుంబంతో వచ్చి తీసుకెళ్లాలని సూచించారు. విడిగా వచ్చిన వారికి ప్యాంటు, షర్టులు ఇచ్చి పంపించారు. ఇళ్ల స్థలాల కోసం రూ.8 లక్షల మొత్తాన్ని అక్కడికక్కడే జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడికి ఎమ్మెల్యే అందజేశారు.
క్రోసూరులోని ఓ తోటలో 19న పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మద్యంతో విందు ఇచ్చారు. ఎన్నికల్లో తనకు తోడ్పాటు అందించాలని, మీ అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే వెళ్లిపోయాక అనుచరులు విలేకరులకు చీర, ప్యాంటు, షర్టు, రైస్ కుక్కర్‌తో కూడిన కిట్లు అందజేశారు.
మాచర్లలో తెదేపా ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో 18న ఆత్మీయ సమావేశం జరిగింది. తాము అధికారంలోకి వస్తే మాచర్లలో ప్రెస్‌క్లబ్ ఏర్పాటు చేస్తామని, విలేకరులపై దాడులు జరగకుండా చూస్తామన్నారు. ఇళ్లస్థలాలు మంజూరు చేస్తామన్నారు. అనంతరం విందు ఇచ్చి, సూట్‌కేసులు అందజేశారు.
source : eenadu.net
Discussion about this post