అభ్యర్థులంతా విజయంతో తిరిగి రావాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు బి-ఫాంలు అందజేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని చంద్రబాబు అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. బి-ఫాంలు అందుకున్న వారిలో అనంతపురం పార్లమెంటు పరిధిలోని ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ (అనంతపురం), అమిలినేని సురేంద్రబాబు (కళ్యాణదుర్గం), దగ్గుపాటి ప్రసాద్ (అనంతపురం అర్బన్), బండారు శ్రావణిశ్రీ (శింగనమల), గుమ్మనూరు జయరాం (గుంతకల్లు) ఉన్నారు. హిందూపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, బాలకృష్ణ (హిందూపురం అసెంబ్లీ) సవిత (పెనుకొండ), ఎం.ఎస్.రాజు (మడకశిర), సింధూరరెడ్డి (పుట్టపర్తి) తదితరులు ఉన్నారు. వారి నియోజకవర్గాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసుకోవాలని, నిత్యం జనంలో ఉండాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
source : eenadu.net
Discussion about this post