‘2.60 లక్షల మంది వాలంటీర్లు నా సైన్యం. పేదవాడికి సేవ చేసేందుకు.. భవిష్యత్తును మార్చేందుకు యుద్ధానికి మీరు సిద్ధమా’’ అని వాలంటీర్లకు సీఎం జగన్ పిలుపునిచ్చారు. ‘58 నెలలు నాతోపాటు మీరు ప్రజలకు సేవలు అందించారు. ఇంకో రెండు నెలలు సేవ చేసేందుకు, పేదవాడి భవిష్యత్తు మార్చేందుకు పనిచేయాలి’ అని కోరారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో గురువారం జరిగిన గ్రామ, వార్డు వాలంటీర్ల సేవా పురస్కారాల ప్రదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిపాలనలో సంస్కరణలను ప్రజలకు చేరవేసే యువ సైన్యమే వాలంటీర్ల వ్యవస్థ అని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలోని 17 వేల నిరుపేద కూలీల కుటుంబాలకు ఇప్పుడు ఇస్తున్న రూ.2500ను పెంచి మార్చి నుంచి రూ.5వేలు చెల్లిస్తామని ప్రకటించారు.
వాలంటీర్ల వ్యవస్థతోనే విజయాలు
తెదేపా అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య జన్మభూమి కమిటీలు తెదేపాను అధికారం నుంచి దింపడానికి కారణమైతే… 2019లో ఏర్పాటుచేసిన వాలంటీర్లు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు అనుసంధానమై పేదలకు వారధిగా పనిచేసి స్థానికసంస్థలు, ఉప ఎన్నికల్లో వైకాపా విజయానికి కారకులు కావడం గర్వకారణమన్నారు. అందుకే వాలంటీర్ల సేవలకు ప్రతిఫలంగా వారికి ఇచ్చే బహుమతిలో 50% మొత్తాన్ని పెంచామన్నారు. మొత్తం 2,55,464 మంది వాలంటీర్లకు రూ.392 కోట్లను ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఎన్నికల ముందు వరకు వెయ్యే పింఛను
చంద్రబాబుపై సీఎం జగన్ పలు విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో 39 లక్షల మందికి 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు నెలకు పింఛను కింద రూ.1000 ఇచ్చేవారని విమర్శించారు. అదే వైకాపా ప్రభుత్వంలో 66 లక్షల మందికి నెలకు రూ.3వేల చొప్పున ఇస్తున్నామన్నారు.
అమలు చేయలేని హామీలు
‘చంద్రబాబు ఇతర రాష్ట్రాల హామీలను సమకూర్చి కిచిడీ మ్యానిఫెస్టో తయారుచేస్తే వైకాపా ప్రణాళిక ప్రజల కష్టాలకు సమాధానంగా వచ్చింది. చంద్రబాబు చెప్పే హామీలు అమలుచేయాలంటే ఇంకో రూ.52,700 కోట్లు కావాలి. వీటితోపాటు కొత్త పథకాలు అమలుచేయాలంటే రూ.1.26 లక్షల కోట్లు కావాలి. ఇవన్నీ చేయడం సాధ్యం కాదు. మోసం చేయడానికే చెబుతున్నారు. చంద్రబాబును నమ్మితే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మడమేనని వాలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. పేదవాడి భవిష్యత్తు మారాలంటే వారి బతుకులు ఇంకా మెరుగుకావాలంటే మరోసారి మన ప్రభుత్వాన్ని గెలిపించాలి. 58నెలల్లో ప్రభుత్వం నుంచి పథకాలు అందుకున్న లబ్ధిదారులను స్టార్ క్యాంపెయినర్లుగా తీసుకురావాలి. ప్రతి ఇంటికీ వెళ్లి 2014 ఎన్నికలకు ముందు తెదేపా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేసిన మోసాన్ని చెప్పండి. రకరకాల మీడియాలు, చంద్రబాబు, దత్తపుత్రుడు, పరోక్షంగా ఓ జాతీయ పార్టీ, ప్రత్యక్షంగా మరో జాతీయ పార్టీతో జగన్ యుద్ధం చేస్తున్నారు. వీరంతా నాకు వాలంటీర్లనే పెద్దసైన్యం ఉందనే విషయం మరచిపోయారు’ అని చెప్పారు.
source : eenadu.net
Discussion about this post