ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీచేసే అభ్యర్థుల విజయానికి గ్రామ వాలంటీర్లు, ఉపాధి హామీ, వెలుగు సిబ్బంది, యానిమేటర్లు కృషి చేయాల్సిందేనని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉష శ్రీచరణ్ హుకుం జారీ చేశారు. శుక్రవారం శ్రీసత్యసాయి జిల్లా పరిగి, రొద్దం మండల కేంద్రాల్లో మంత్రి ఆధ్వర్యంలో వాలంటీర్లు, వెలుగు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, యానిమేటర్లు, సర్పంచులు, పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఓటర్లు వైకాపాకు ఆకర్షితులయ్యేలా కృషిచేయాలన్నారు.సమావేశాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులతో ఇది తమ అంతర్గత సమావేశమని చెప్పి పంపించేశారు. పరిగిలోని కల్యాణ మండపం తలుపులు వేసి మరీ సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతుండగా కొందరు పార్టీ శ్రేణులు, వాలంటీర్లు సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తుండగా మీ బుర్రలో సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవాలని, అందరూ ఫోన్ స్విచ్ఛాఫ్ చేయాలని కోరారు.
source : eenadu.net
Discussion about this post