వాలంటీర్లు ప్రభుత్వంలో భాగమే కాబట్టి.. వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్‌కుమార్ మీనా హెచ్చరించారు. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయన్నారు. ఉపాధ్యాయులు లేకుండా ఎన్నికలు నిర్వహించలేమని, ఎన్నికల విధుల్లో దాదాపు 60 శాతం వారే ఉంటారన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకున్నా.. కేవలం వేలికి ఇంకు వేయడానికే పరిమితం చేస్తామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉండే అయిదుగురు అధికారుల్లో, సచివాలయ సిబ్బంది ఒక్కరే ఉంటారని స్పష్టం చేశారు. శనివారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
46,165 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
‘రాష్ట్రంలో మొత్తం 4,09,37,352 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 2,00,84,276, స్త్రీలు 2,08,49,730, ఇతరులు 3,346, ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 7,763, సర్వీసు ఓటర్లు 67,393, 85 ఏళ్లకు పైగా ఉన్నవారు 2,12,237 మంది ఉన్నారు. గత 45 రోజుల్లోనే దాదాపు 1.75 లక్షల మంది ఓటు నమోదు చేసుకున్నారు. ఓటు నమోదు కోసం ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరోజు వరకు వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులకు ఓటుహక్కు కల్పిస్తాం. శనివారం నుంచి తొలగింపు దరఖాస్తులు స్వీకరించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 46,165 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 179 కేంద్రాల్లో మహిళా సిబ్బంది మాత్రమే విధుల్లో ఉంటారు. పోలింగ్‌కు అయిదు రోజుల ముందు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తాం. 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేయడానికి వెసులుబాటు కల్పిస్తున్నాం. ఇందుకోసం ఫాం-12 దరఖాస్తులు నింపాల్సి ఉంటుంది. రిటర్నింగ్ అధికారి వాటిని పరిశీలించి ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తారు. సంక్షేమ పథకాలకు ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేస్తే.. ఈసీఐ ఆమోదంతో వారికి ప్రయోజనాలు అందించవచ్చు. అయితే ఇప్పుడు లబ్ధిదారులను ఎంపిక చేయకూడదు’ అని స్పష్టం చేశారు.
2 లక్షల ఈవీఎంల కేటాయింపు
‘అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్ పత్రాలు నింపవచ్చు. కానీ.. సంబంధిత పత్రాలను వ్యక్తిగతంగానే ఆర్వోకు అందించాలి. క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు పత్రికల్లో తప్పనిసరిగా మూడుసార్లు ప్రకటనలివ్వాలి. ఈ ఎన్నికల కోసం దాదాపు 3.82 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులతో సహా దాదాపు 4 లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తాం. 50 మంది జనరల్ అబ్జర్వర్లు, ప్రతి అసెంబ్లీకి మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశాం. 2 లక్షల ఈవీఎంలను ఈసీఐ కేటాయించింది’ అని వెల్లడించారు.
24 గంటల్లో పోస్టర్లు తొలగించాలి
‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో 24 గంటల్లోగా ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల నుంచి రాజకీయ నేతల పోస్టర్లు తొలగించాలి. లబ్ధిదారులకు ఇచ్చే పథకాలు, కార్యాలయాలపై సీఎం ఫొటోలు ఉండకూడదు. కొత్తగా ఎలాంటి పనులు చేపట్టరాదు. శనివారం నుంచి అధికార యంత్రాంగం పూర్తిగా ఈసీ ఆధీనంలోకి వస్తుంది. మంత్రులు, ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ వర్తించదు. సీఎంఆర్‌ఎఫ్ నిధులు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా ఆ జిల్లా ఎస్పీ బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని ముకేశ్‌కుమార్ మీనా పేర్కొన్నారు.
121 చెక్‌పోస్టుల ఏర్పాటు
‘ఎన్నికల షెడ్యూలు వెలువడటానికి ముందు నుంచే రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ఠ నిఘా పెట్టాం. 121 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు రూ.164 కోట్ల విలువ గల నగదు, వస్తువులు, మాదకద్రవ్యాలు, మద్యం స్వాధీనం చేసుకున్నాం. ఎన్నికల నిర్వహణ, భద్రతకు 2,18,515 మంది పోలీసులు అవసరం. రాష్ట్రంలో 45,000 మంది సివిల్ పోలీసులు, 32 కంపెనీల ఆర్మ్‌డ్ బలగాలు ఉన్నాయి. కేంద్రం నుంచీ మరిన్ని బలగాలు వస్తాయి’ అని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ శంకబ్రత బాఘ్చి తెలిపారు.
source : eenadu.net
Discussion about this post