నిస్వార్థ సేవకు ప్రతిరూపాలు మీరేనని వలంటీర్లను జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ అభినందించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరువ చేయడంలో అహర్నిశం శ్రమించిన వలంటీర్లుకు ఉత్తమ సేవా పురస్కారాల ప్రదానోత్సవం గురువారం అనంతపురంలోని రెవెన్యూభవన్‌లో జరిగింది. ఇన్‌చార్జ్ కలెక్టర్ కేతన్‌గార్గ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహమ్మద్, డీసీసీడీ చైర్‌పర్సన్ లిఖిత, ఆర్టీసీ జోనల్ చైర్‌పర్సన్ మంజుల, నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, ఏపీ అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ టి.లక్ష్మి, వ్యవసాయ సలహా మండలి జిల్లా కమిటీ సభ్యుడు ఆలమూరు సుబ్బారెడ్డి పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సందేశాన్ని అందరికీ వినిపించారు. అనంతరం గిరిజమ్మ మాట్లాడుతూ.. వరుసగా నాల్గో ఏడాది వలంటీర్లకు అవార్డులు అందజేయడం గర్వంగా ఉందన్నారు. నవరత్నాలు, సంక్షేమ పథకాల ఫలాలను పేద, మధ్య తరగతి ప్రజలకు చేరువ చేయడంలో వలంటీర్లు అందించిన సేవలను కొనియాడారు. కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందించిన విషయాన్ని ఎవరూ మరచిపోలేరన్నారు. వలంటీర్ల సేవకు గుర్తింపుగా సేవావజ్రకు ఇచ్చే రూ.30 వేలను రూ.45 వేలకు, సేవారత్నకు రూ.20 వేల నుంచి రూ.30 వేలకు, సేవామిత్ర పురస్కారాలను రూ.10 వేల నుంచి రూ.15 వేలకు అంటే 50 శాతం పెంచి ఇవ్వడంతో జగనన్న మరో రికార్డు సృష్టించారన్నారు. వలంటీర్లు మరింత సమర్థవంతంగా సేవలందించి, ప్రతి ఒక్కరూ పురస్కారాలకు ఎంపిక కావాల్సి ఉందని ఇన్‌చార్జ్ కలెక్టర్ కేతన్‌గార్గ్ పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 39 మందికి సేవా వజ్ర అవార్డులకు ఎంపికై నట్లు తెలిపారు. అలాగే సేవారత్న అవార్డుకు 198 మంది, సేవామిత్ర అవార్డుకు మొత్తం 10,943 మంది ఎంపికై నట్లు వివరించారు. అలాగే టెస్టిమోనియల్స్ కింద వైఎస్సార్ పింఛన్ కానుక, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల కింద లబ్ధిదారుల మనోభావాలను అత్యుత్తమంగా సేకరించి 46 మంది వలంటీర్లకు వేర్వేరుగా నగదు బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందులో జిల్లా స్థాయిలో ఎంపికై న ఒకరికి రూ.25 వేలు, నియోజకవర్గ స్థాయిలో ఎంపికై న ఎనిమిది మందికి రూ.20 వేలు చొప్పున రూ.1.60 లక్షలు అందజేశారు. మండల, మున్సిపాలిటీ స్థాయిలో ఎంపికై న 37 మంది వలంటీర్లకు రూ.15 వేలు చొప్పున రూ.5.55 లక్షలు అందించారు.
source : sakshi.com
Discussion about this post