వలంటీర్లపై నీచమైన వ్యాఖ్యలు చేసినందుకు బేషరత్తుగా వారికి క్షమాపణ చెప్పాలని టీడీపీ నాయకులకు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హితవు పలికారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వలంటీర్ల సేవలను చూసిన చంద్రబాబు, ఆయన అనుచరుల గుండెల్లో రైళ్లు పరుగుతీస్తున్నాయన్నారు. దీంతో ఓటమి భయంతో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు వలంటీర్ల వ్యవస్థను కించపరిచేలా మాట్లాడుతున్నారన్నారు. టీడీపీ కార్యకర్తల జేబులు నిండడం లేదన్న అక్కసుతో వలంటీర్లను ఉగ్రవాదులు, జిహాదీలు, స్లీపర్‌సెల్స్‌తో పోల్చుతూ నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేవలం గౌరవవేతనంతో వలంటీర్లు నిస్వార్థ సేవలు అందిస్తున్నారన్నారు. కోవిడ్ సమయంలో టీడీపీ నేతలు ప్రజలకు దూరంగా ఉంటే… వలంటీర్లు మాత్రం ప్రాణాలకు తెగించి గడప గడపకూ వెళ్లి సంక్షేమ పథకాలతో పాటు వైద్య సేవలను అందజేశారని గుర్తు చేశారు. వలంటీర్ల సేవలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కొనియాడుతుంటే టీడీపీ నాయకులు మాత్రం ఆరోపణలు చేస్తుండడం వారి నీచ రాజకీయానికి నిదర్శనమన్నారు. ఇప్పటికై నా వలంటీర్లకు క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో చంద్రబాబు, ఆయన బృందం ఉనికి కోల్పోవడం ఖాయమన్నారు.
source : sakshi.com
Discussion about this post