సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నగదు పురస్కారాలతో సత్కరించనుంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కాగా ప్రభుత్వం ఈ ఏడాది నగదు పురస్కారాలను భారీగా పెంచింది.
ప్రతి శాసనసభా నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందించిన ఐదుగురికి సేవావజ్ర అవార్డులను అందించనుంది. వీటి కింద గత మూడేళ్లుగా రూ.30 వేల చొప్పున ప్రభుత్వం నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని 50 శాతం పెంచి ఏకంగా రూ.45 వేలు చేసింది. అలాగే మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన ప్రతి ఐదుగురు వలంటీర్లకు సేవారత్న అవార్డులను అందించనుంది. వీటి కింద గత మూడేళ్లు రూ. 20 వేల చొప్పున నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.30 వేలకు పెంచింది.
అదేవిధంగా కనీసం ఏడాదికాలంగా పనిచేస్తూ.. ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన మిగిలిన వలంటీర్లందరికీ సేవామిత్ర అవార్డులు అందించనుంది. వీటి కింద గత మూడేళ్లుగా రూ.10 వేల చొప్పున నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన నగదు బహుమతులను తాజా పురస్కారాల ప్రదానోత్సవంలో వలంటీర్లకు అందించనుంది.
source : sakshi.com
Discussion about this post