‘అవ్వా.. చెప్పులేసుకో. లేదంటే కాళ్లు కాలుతాయి’ అని మనువరాలు చెబుతున్నా వినిపించుకోకుండా.. ‘ఆ చెప్పులతోనేమి.. బిర్నా రా ఆ సామి వెళ్లిపోతాడేమో’ అంటూ వృద్ధురాలు అలివేలమ్మ వేగంగా పొలంలో నుంచి రోడ్డు మీదకు వచ్చింది. అటుగా బైక్ మీద వెళుతున్న వ్యక్తిని ఆపి.. ‘ఎంత వరకు వచ్చాడు?’ అని ఆరా తీసింది. ఇంకా రాలేదు.. వస్తున్నాడని చెప్పి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు.
ఈ లోపు మనవరాలు అలివేలమ్మ దగ్గరకు వచ్చి.. ‘చెబితే వినవు.. సీఎం జగన్ రావడానికి ఇంకా చానాసేపు పడుతుంది. చెట్టునీడకు రా..’ అని పిలవగా.. ‘ఉదయం నుంచి ఎదురు చూస్తున్నా.. కొద్దిసేపు ఇక్కడ నిలబడితే ఏం కాదులే.. ఐదేళ్ల క్రితం ఇదే దారిలో వెళుతుంటే కలిశాను. అధికారంలోకి వస్తావ్ అని అప్పట్లో చెప్పాను.. అనుకున్నట్టే సీఎం అయ్యాడు. మాటిచ్చినట్టే ఇంటి దగ్గరకే పెన్షన్ పంపాడు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వస్తున్నాడు. మళ్లీ నువ్వే అధికారంలోకి వస్తావ్ అని ఆ సామికి చెబుతానమ్మి..’ అంటూ అవ్వబదులిచ్చింది.
చిత్తూరు జిల్లా సదుం ఎస్టీ కాలనీకి చెందిన ఎం.మునెమ్మకు వందేళ్లు ఉంటాయి. స్వతహాగా నడవలేదు, నిల్చోలేదు. అయినప్పటికీ ఎంతో ఓపికగా ఉదయం నుంచి సదుం నుంచి కల్లూరుకు వెళ్లే రహదారి పక్కన కుర్చీలో కూర్చుని ఉంది. ఎక్కువసేపు నువ్ కూర్చోలేవ్ ఇంట్లో పడుకుందువ్ రా.. అని మనవడు పిలిచినా వినడం లేదు. ఆమె గంటల తరబడి అక్కడే వేచి ఉండటానికి కారణం ఏంటని ఆరా తీస్తే.. ఈ రోడ్డు మీదుగా సీఎం జగన్ వస్తున్నారని, ఆయన్ని ఓ సారి చూద్దామని ఎదురు చూస్తోందని ఆమె మనవడు తెలిపాడు. ఇలా అలివేలమ్మ, మునెమ్మల తరహాలో ఎందరో వృద్ధులు.. మహిళలు, వికలాంగులు, విద్యార్థులు, రైతులు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా గంటల తరబడి రోడ్లపై బారులు తీరి తమ అభిమాన నాయకుడిని చూడటానికి పోటీపడ్డారు.
వివిధ సంక్షేమ పథకాల ద్వారా తమకు అండగా నిలిచిన నేతను కళ్లారా చూసి ఉబ్బితబ్బిబ్బయ్యారు. ‘తమను అన్ని విధాలుగా ఆదుకున్న మీకే మా మద్ధతు.. ఎన్ని జెండాలు జత కట్టినా మరోసారి చంద్రబాబు మా చేతుల్లో చిత్తవ్వడం ఖాయం’ అని సీఎం జగన్‌కు ప్రజలు తేల్చి చెప్పారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ‘మేమంతా సిద్ధం’ అంటూ బస్సు యాత్ర నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పుంగనూరు నియోజకవర్గం అమ్మగారిపల్లెలో బస శిబిరం నుంచి బుధవారం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో ఏడో రోజు యాత్రను ప్రారంభించారు.
source : sakshi.com
Discussion about this post