వంట గ్యాస్ సిలిండర్ పై వినియోగదారుల బిల్లులో ఉన్న మొత్తం కంటే అదనంగా చార్జీలు వసూలు చేయరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ డీలర్లను హెచ్చరించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వంశీకృష్ణారెడ్డి తో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తాసిల్దారులు ఐఓసీ, హెచ్ పి ఎల్, బి పి సి గ్యాస్ ఏజెన్సీల యాజమాన్యాలు, సేల్స్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కొందరు గ్యాస్ డెలివరీ బాయ్స్ , కొంతమంది ఏజెన్సీ యజమానులు తమ గోడౌన్ల నుంచి డెలివరీ పాయింట్ దూరంగా ఉందని అలాగే ఇతర కారణాలతో రవాణా చార్జీలు కూడా చెల్లించాలంటూ వినియోగదారుల వద్ద అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. డెలివరీ బాయ్స్ రూ.50 నుంచి రూ .100 రూపాయలు దాకా వినియోగదారుల బిల్లు కన్నా అదనంగా అక్రమ వసూళ్లకు పాల్పపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి విషయాలు పునరావతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని పౌరసరఫరాల అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఎమ్మార్వోలు, డిప్యూటీ తాసిల్దారులు, ఈ అంశంలో ప్రత్యేక చొరవ చూపి పర్యవేక్షణ చర్యలు చేపట్టాలని, వంట గ్యాస్ సిలిండర్ పై వస్తున్న ఫిర్యాదులను అరికట్టాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని కంపెనీల గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు అధిక ధర వసూలు చేయరాదని గతంలో ఆదేశాలు జారీ చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఎవరైనా డెలివరీ బాయ్స్ అదనంగా చార్జీలు వసూలు చేస్తే వినియోగదారులు జిల్లా పౌర సరఫరాల అధికారి లేదా సంబంధిత ఏజెన్సీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదులు రుజువైనట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చునని 1800233555 జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత డీలర్లు, డిప్యూటీ తాహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post