కాదేదీ అక్రమాలకు అనర్హం అన్నట్లు ఆ సోదరులు రెచ్చిపోయారు. అధికారమే అండగా చెలరేగారు. అడ్డగోలుగా వ్యాపారాలు సాగించారు. ప్రకృతి వనరులను కొల్లగొట్టారు. దేవుని మాన్యాన్నీ చెరబట్టేశారు. పేదల కడుపు గొట్టారు. చివరికి అసాంఘిక కార్యకలాపాలకూ తెరలేపారు. తమకు అడ్డు చెప్పిన అధికారులపై దాడులకూ వెనుకాడలేదు. అలాంటి వారు నేడు ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ప్రజల ముందుకు వెళ్తూ నీతి మాటలు మాట్లాడుతుండడంపై జనం నవ్వుకుంటున్నారు.
: గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. నాలుగు దశాబ్దాల పాటు అక్రమంగా ట్రావెల్స్ వ్యాపారం సాగించి రూ.కోట్లు దండుకున్నారు. ఒక బస్సుతో ప్రారంభమైన వారి ట్రావెల్స్ వ్యాపారం నుంచి వందల సంఖ్యలో బస్సులు పుట్టుకొచ్చాయి. ఒక పర్మిట్ నంబర్‌తో ఏకంగా నాలులైదు బస్సులు తిప్పుతూ ఆర్టీఏ అధికారులనే బురిడీ కొట్టించేవారు. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు ఓ ప్రయాణికురాలు ఇచ్చిన సమాచారం మేరకు 2012లో అప్పటి రవాణాశాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య స్వయంగా అధికారులతో కలిసి దాడులు చేశారు.
కర్నూలు–హైదరాబాద్ జాతీయ రహదారిలో తనిఖీలు నిర్వహించి మొబైల్ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు. బస్సు సీజ్ చేశారు. ఈ విషయం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, ఘటన జరిగిన కొన్నాళ్ల పాటు నిబంధనలు పాటించిన జేసీ సోదరులు… ఆ తర్వాత మంగళం పాడారు. అంతేనా.. కండీషన్ లేని బస్సులను నడుపుతూ అనేక ప్రమాదాలకు కారణమయ్యారు. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. అయితే, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక వీరి అక్రమాలను బట్టబయలు చేయడంతో ట్రావెల్స్ మూసేశారు.
తాడిపత్రి ప్రాంతంలో 800కు పైగా గ్రానైట్ పరిశ్రమలున్నాయి. మామూలుగా వీటికి గ్రానైట్ రాళ్లను చిత్తూరు, మడకశిర, కర్నూలు ప్రాంతాల నుంచి తీసుకువస్తుంటారు. క్వారీ నుంచి ఒక లోడు గ్రానైట్ తాడిపత్రికి చేరాలంటే రూ.45 వేల నుంచి రూ.50 వేల మేర రాయల్టీ చెల్లించాలి. అయితే టీడీపీ హయాంలో రాయల్టీ లేకుండా క్వారీ నుంచి తాడిపత్రికి గ్రానైట్ చేర్చేలా క్వారీ యాజమాన్యాలు, తాడిపత్రి పాలిష్ మిషన్ వ్యాపారుల మధ్య అక్రమ ఒప్పందం కుదిరింది. దీనికితోడు లారీలో ఉన్న గ్రానైట్ పరిమాణాన్ని బిల్లులో తగ్గించి ఒకే బిల్లుతో ఐదారు లోడ్లు రవాణా చేసేవారు. అలా కొల్లగొట్టిన డబ్బు లగాన్ పేరుతో మాఫియాను నడిపే ఓ పెద్దమనిషి ఇంటికి చేరేది. ఈ క్రమంలోనే 2015 ఆగస్టు 21న మైనింగ్ విజిలెన్స్ ఏడీగా బాధ్యతలు స్వీకరించిన ప్రతాప్‌రెడ్డి ఈ అక్రమ దందాపై ఉక్కుపాదం మోపారు.
2015కు ముందు ఏటా రూ.కోటి కూడా పెనాల్టీ రూపంలో ప్రభుత్వానికి అందేది కాదు. కానీ 2015–16లో రూ.5.40 కోట్లు, 2016–17లో రూ.5.55 కోట్లు రాబట్టారంటే లగాన్ దందా ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ప్రతాప్ రెడ్డి ఇక్కడ ఉంటే తమ ఆటలు సాగవని గుర్తించిన జేసీ సోదరులు ఎలాగైనా బదిలీ చేయించాలని చూశారు.చంపుతామంటూ బెదిరింపులకు కూడా దిగారు. దీనిపై అప్పట్లో ఆయన మైనింగ్ విజిలెన్స్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి (పొట్టి రవి), అప్పట్లోగ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్న నాగేశ్వరరెడ్డి, బిల్లుల బాబు నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, కొన్నాళ్లకే ప్రతాప్‌రెడ్డిని బదిలీ చేయించిన ఈ ముఠా..మళ్లీ అక్రమాలు యథేచ్ఛగా సాగించింది. ఈ మాఫియా ద్వారా రూ.200 కోట్లకు పైగా జేసీ సోదరులు వెనకేశారన్న ఆరోపణలున్నాయి.
source : sakshi.com
Discussion about this post