నుదిటిపై గాయం మానలేదు.. కుట్లు పచ్చి ఆరలేదు.. కంటిపైన వాపు తగ్గలేదు.. అయినా పెదాలపై చిరునవ్వు చెరగలేదు. ఆ ముఖంలో ఏ మాత్రం భయంలేదు. సడలని ఉక్కు సంకల్పంతో మరింత దృఢ నిశ్చయంతో జగన్ సోమవారం తన బస్సుయాత్రను ముందుకు దూకించారు. దాడులతో మన యాత్రను ఆపలేరని, ధైర్యంగా ముందుగు సాగుదామని కేడర్లో జోష్ నింపారు. బస్సుయాత్రలో భాగంగా ప్రతిరోజూ ఉ.9 గంటల నుంచి జగన్ సంబంధిత నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను కలుస్తారు.
అలాగే, సోమవారం ఈ కార్యక్రమానికి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి పలువురు నాయకులు తరలివచ్చారు. వారిని కలిసిన అనంతరం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కారణంగా డాక్టర్ల సూచనతో ఒకరోజు విశ్రాంతి తర్వాత కృష్ణాజిల్లా కేసరపల్లి నుంచి జగన్ ‘మేమంతా సిద్ధం’ 15వ రోజు బస్సుయాత్ర సోమవారం ఉదయం 10.25 నిమిషాలకు ప్రారంభమైంది. కేసరపల్లి బస ప్రాంతానికి అప్పటికే భారీగా చేరుకున్న అభిమానులు జగన్ రాకతో జై జగన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు.
అక్కడి నుంచి వందలాది మోటార్ బైకులు ర్యాలీగా ముందు నడవగా.. బస్సుయాత్ర గన్నవరం చేరుకుంది. మార్గమధ్యంలో తన కోసం వచ్చిన ఓ మహిళా అభిమానితో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. గన్నవరం నియోజకవర్గం కొత్తపేటలో ప్రవేశించిన ముఖ్యమంత్రికి జాతీయ రహదారికి ఇరువైపులా బారులుతీరిన మహిళలు అఖండ స్వాగతం పలికారు. గన్నవరం వద్ద జాతీయ రహదారికి రెండువైపులా జనసందోహంతో నిండిపోయింది. గన్నవరం చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత జనంతో కూడళ్లు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి.
బస్సుపైకెక్కి వారికి అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు. మహిళలు జననేతకు గుమ్మడికాయలతో దిష్టితీసి హారతులిచ్చారు. జగనన్నా.. నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డువేస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గాంధీబొమ్మ సెంటర్ జనసంద్రంగా మారింది. ఆపదను దాటి వచ్చిన నాయకుడికి అక్కడి ప్రజలు ప్రేమతో స్వాగతం పలికారు. జగన్‌ను చూసేందుకు పెద్దఎత్తున భవనాలపైకి స్థానికులు చేరుకున్నారు. జననేతను చూసి ఆనందంతో అభివాదం చేశారు.
source : sakshi.com
Discussion about this post