పింఛను సొమ్ము కోసం పండుటాకులు రెండో రోజూ అవస్థలు పడ్డారు. గురువారం బ్యాంకుల వద్ద పడిగాపులు కాచిన చాలామందికి డబ్బులు డ్రా చేసుకునే అవకాశం లభించలేదు. దీంతో శుక్రవారం అవ్వాతాతలు బ్యాంకుల బాట పట్టారు. గ్రామాల నుంచి వ్యయప్రయాసలకు ఓర్చి బ్యాంకుల వద్దకు చేరుకున్న కొందరికి నిరాశ ఎదురైంది. ఖాతాలు యాక్టివ్‌గా లేని వివరాలను కనీసం సచివాలయాల వద్ద ప్రదర్శిస్తే వృద్ధులు బ్యాంకు వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు కదా అనే వాదన వినిపిస్తోంది. గ్రామాల్లోని బ్యాంకు కరస్పాండెన్స్ కేంద్రాల వద్ద నిలువ నీడ లేక వృద్ధులు ఎండలకు విలవిలలాడారు. సర్వర్లు నెమ్మదిగా ఉండటంతో సొమ్ము డ్రా చేసుకోవడానికి గంటల కొద్ది వేచి చూడాల్సి వచ్చింది. ఈ పాపం అంతా సీఎం జగన్‌దే అని పలువురు లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చాలాకాలంగా నిర్వహణ లేని ఖాతాల్లోకి వేసిన సొమ్ము వెనక్కి వచ్చిందని గురువారం సెర్ఫ్ అధికారులు ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో 93 వేల మంది ఖాతాల్లో డబ్బులు జమకాలేదని పేర్కొన్నారు. రెండోరోజుకు ఈ సంఖ్యను పూర్తిగా తగ్గించారు. కేవలం 7,382 ఖాతాల్లోనే డబ్బులు జమకాలేదని.. మిగిలిన వారందరూ బ్యాంకులకు వెళ్లే తీసుకోవాలని చెబుతున్నారు. ఇలా రోజుకో మాట చెబుతూ వృద్ధులను అవస్థలకు గురిచేస్తున్నారు. మంచానికి పమితమైన, నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటివద్దనే పింఛను పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో మాత్రం సచివాలయాల సిబ్బంది కార్యాలయాల వద్దకే పిలిపించుకుని నగదు అందజేశారు.
source : eenadu.net
Discussion about this post