రెవెన్యూ రాబడులు అంతంతమాత్రమే
కేటాయింపులు పెరగడం అనుమానమే
వైకాపా ప్రభుత్వం బుధవారం ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ సమర్పించబోతోంది. సుమారు రూ. 2.80 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఈ బడ్జెట్ సమర్పించనున్నారని తెలిసింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో ఉదయం బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించినా ఏప్రిల్, మే, జూన్, జులై నెలలకే బడ్జెట్‌కు ఆమోదం తీసుకుంటారు. ‘రాబడి పెరిగినా సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చడమే చాలా కష్టంగా ఉంది’ అని సీఎం జగన్ మంగళవారం శాసనసభలోనే చెప్పిన నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ బడ్జెట్‌లో నిధులు అంతంత మాత్రమేనా అన్న చర్చ సాగుతోంది. జగన్ ప్రభుత్వం గడిచిన అయిదేళ్లలో ఆయన పాదయాత్రలో ఇచ్చిన ఎన్నో హామీలు నెరవేరలేదు. జలయజ్ఞం పూర్తిగా భగ్నమైంది. అభివృద్ధి కార్యక్రమాలు ఆచూకీ లేవు. రెవెన్యూ రాబడులు లెక్కకు మిక్కిలి అంచనావేస్తూ రూపొందించిన బడ్జెట్లూ అంతంతమాత్రంగానే అమలయ్యాయి. ఆర్థికంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న జగన్ సర్కార్ ఈ బడ్జెట్‌లో వివిధ రంగాలకు కేటాయింపులు పెద్దగా పెరిగే అవకాశం లేదని సమాచారం. ఇది ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ మాత్రమే. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఎన్నికల తర్వాత కొత్తగా కొలువుదీరే ప్రభుత్వమే ప్రవేశపెడుతుంది. పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఆశించిన రాబడులు ఏవీ?
జగన్ ప్రభుత్వం ప్రతి ఏటా పెద్దమొత్తంలో రాబడులు ఆశించి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తున్నా ఆ స్థాయిలో రాబడి ఉండటం లేదు. అప్పులు మాత్రం అంచనాలకు మించి ఉంటున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,78,697.41 కోట్ల రెవెన్యూ రాబడులు ఆశించగా, వచ్చినవి రూ.1,11034.02 కోట్లు మాత్రమే. 2020-21 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే ధోరణి కొనసాగింది. ఆశించిన రాబడి రూ.1,61,958.50 కోట్లుగా కాగా వాస్తవ రాబడి రూ.1,17,136.18 కోట్లే. 2021-22లో రూ.1,77,196.48 కోట్లు ఆశిస్తే రూ.1,50,552.49 కోట్లే దక్కింది. 2022-23లో రూ.1,91,225.11 కోట్లు రాబడి అంచనాగా ఉంది. అంచనాలు సవరించే నాటికి రూ.1,76,448 కోట్లే వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,06,224 కోట్ల రాబడి ఆశిస్తే తొలి 10 నెలల్లో జనవరి నెలాఖరు వరకు వచ్చిన మొత్తం 1,19,125 కోట్లే. ఇప్పటికే కాగ్ వరుసగా ఆర్థికశాఖకు తలంటుతూ వస్తోంది. బడ్జెట్ అంచనాలకు, అదనపు ఆమోదాలకు, వాస్తవ ఖర్చులకు పొంతనే లేదని తన నివేదికల్లో ప్రస్తావిస్తోంది. ఈ విమర్శల నేపథ్యంలో ఈ బడ్జెట్ ఎంత వాస్తవ దృక్పథంతో ఉంటుందనేది చర్చనీయాంశమవుతోంది.
కేటాయింపులు అంతంతేనా
అన్ని ప్రభుత్వశాఖలు రూ.3.20 లక్షల కోట్లకు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవ ఖర్చు ఆధారంగానే కేటాయింపులు ఉంటాయని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో లెక్కలను సవరించనున్నారు. ప్రస్తుతం జనవరి నెలాఖరు వరకే ఖర్చులు జరిగాయి. ఆర్థిక సంవత్సరం మొత్తానికి అంచనాలు సవరిస్తారు. ప్రస్తుత ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌లో ఆయా శాఖల కేటాయింపులు కూడా అంతకుమించి చేయకూడదనే సూత్రంతో వ్యవహరిస్తున్నారు. కేంద్రసాయంతో అమలు చేసే పథకాలకు రాష్ట్రం తన వాటా నిధులు సరిగా ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉన్న పథకాలకే బడ్జెట్‌లో కేటాయింపులు చూపనున్నారు.
source : eenadu.net
Discussion about this post