వైకాపా అధినేత, సీఎం జగన్ చేపట్టిన బస్సుయాత్ర సోమవారం శ్రీసత్యసాయి జిల్లాలో కొనసాగింది. బత్తలపల్లి మండలం సంజీవపురం నుంచి మొదలై బత్తలపల్లి, ముదిగుబ్బ, మలకవేముల క్రాస్ మీదుగా సాయంత్రం 6 గంటలకు కదిరి చేరుకుంది. బస్సుయాత్ర కోసం స్థానిక వైకాపా నాయకులు జనాలను తరలించడం కోసం నానాఅవస్థలు పడ్డారు. గ్రామాల నుంచి వచ్చేవారికి రూ.వెయ్యి చొప్పున ఇచ్చి యాత్రకు తీసుకొచ్చారు. వైకాపా జెండాలు మోసినవారికి మద్యం పంపిణీ చేశారు. బత్తలపల్లి, ముదిగుబ్బ ప్రాంతాల్లో కొందరు రోడ్డుపైనే మద్యం తాగారు. అనంతరం జగన్ పాటలకు డ్యాన్సులు వేయించారు. జగన్ బస్సుయాత్ర సందర్భంగా అనంతపురం-కదిరి జాతీయ రహదారిని అష్టదిగ్బంధనం చేశారు. ముదిగుబ్బ నుంచి రెండు వరసల రహదారే కావడంతో బస్సుయాత్ర కదిరి చేరేంత వరకు వాహనాలను వదల్లేదు. ఇటు కదిరి నుంచి అనంతపురం వెళ్లాల్సిన వాహనాలను కూడా 2 గంటల పాటు నిలిపేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేకపోవడంతో అత్యవసరంగా వెళ్లాల్సిన ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణపై శ్రద్ధ పెట్టకపోవడంతో వాహనదారుల కష్టాలు రెట్టింపయ్యాయి.
జగన్ బస్సుయాత్ర సందర్భంగా ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కదిరి-అనంతపురం వెళ్లాల్సిన బస్సు సర్వీసులను రద్దు చేశారు. రాత్రి 9 వరకు సర్వీసులను పునరుద్ధరించలేదు. సుమారు 20 సర్వీసుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అనంతపురం వెళ్లడానికి వచ్చిన ప్రయాణికులు గంటలకొద్దీ బస్సుల కోసం ఎదురుచూశారు. చాలామంది ప్రయాణాలు రద్దు చేసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. సర్వీసులు నిలిపివేయడంతో కదిరి డిపోకు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించడంలో విఫలం కావడంతో చిత్తూరు నుంచి కదిరి, అనంతపురం వెళ్లాల్సిన బస్సులు 4 గంటలు ఆలస్యంగా గమ్యస్థానం చేరుకున్నాయి.
source : eenadu.net
Discussion about this post