తన ప్రసంగంతో మరోసారి బోర్ కొట్టించిన చంద్రబాబు
గొండుపాలెం, చింతలపూడి సభల్లో కుర్చీలు ఖాళీ
అనకాపల్లి ఎంపీగా తన కుమారుడిని ఆశీర్వదించాలని సభలో అయ్యన్న ధిక్కార స్వరం
అయ్యన్న వ్యాఖ్యలతో తలపట్టుకున్న చంద్రబాబు
మాడుగుల టికెట్ జనసేనకు ఇచ్చినా పనిచేయాలన్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం గొండుపాలెం, ఏలూరు జిల్లా చింతలపూడిలో సోమవారం నిర్వహించిన ‘రా..కదిలి రా’ సభలు తుస్సుమన్నాయి. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రసంగిస్తున్న సమయంలోనే సగం కుర్చీలు ఖాళీ అయ్యాయి. వైఎస్సార్‌సీపీ భీమిలి ఎన్నికల శంఖారావం ‘సిద్ధం’ సభకు ధీటుగా వీటిని నిర్వహించాలని యత్నించిన టీడీపీ చివరకు అభాసుపాలైంది.
గత వారం రోజులుగా అనుకూల మీడియా వార్తలు, టీడీపీ సన్నాహక సమావేశాల్లో రెండు లక్షల మందితో గొండుపాలెం సభ నిర్వహిస్తున్నట్లు ఊదరగొట్టారు. సీన్ కట్ చేస్తే.. రెండు సభల్లో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించడంతో నేతలందరూ అవాక్కై పార్టీ పరిస్థితిపై తలలు పట్టుకున్నారు. పైగా.. సభకు వచ్చిన జనంలో సగం మంది చంద్రబాబు ప్రసంగంపట్ల ఆసక్తిలేక వెనుదిరిగారు. మరికొందరు ఆటోల్లో, చెట్ల కిందే కూర్చున్నారు తప్ప సభాస్థలికి వెళ్లలేదు. చింతలపూడిలో పార్టీ శ్రేణుల అంచనా మేరకు మూడువేల కుర్చీలు వేస్తే అందులో సగానికి పైగా ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి అర్ధంచేసుకోవచ్చు.
source : sakshi.com
Discussion about this post