ఉరవకొండలో శనివారం జరగనున్న తెదేపా ‘రా.. కదలిరా’ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తెదేపా అధినేత చంద్రబాబు హాజరువుతున్న నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. వేదికను పట్టణ శివారున ఏర్పాటు చేశారు. వేదికకు సమీపంలోనే హెలిప్యాడ్ నిర్మించారు.
‘ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైకాపా’: వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలే తెదేపా సభలకు లక్షలాది మంది జనాన్ని రప్పిస్తున్నాయని పీఏసీ ఛైర్మన్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రా కదలిరా బహిరంగ సభ ఏర్పాట్లను వారు స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సభకు లక్ష మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా హాజరవుతున్నారని తెలిపారు. వైకాపా ప్రభుత్వం సంక్షేమాన్ని తక్కువ చేస్తూ, ప్రచారాన్ని మాత్రం ఎక్కువ చేసుకుంటోందన్నారు. అనంత జిల్లాలో హంద్రీనీవా కాలువను అభివృద్ధి చేయడం, దాని ద్వారా నిర్దేశిత ఆయకట్టుకు నీరివ్వడంలో ప్రభుత్వం చొరవ చూపింది లేదన్నారు. చేనేత రంగాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. దళితులకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేసిందని పేర్కొన్నారు. జిల్లాలో పారిశ్రామిక, వ్యవసాయాభివృద్ధికి గత తెదేపా ప్రభుత్వం శాశ్వత పనులను చేపడితే, జగన్ పాలనలో ఒక్క అభివృద్ధిని చేపట్టలేదని వివరించారు. సామూహిక మెగా బిందు సేద్య పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని.. తుంగభద్ర ఎగువ కాలువ ఆధునికీకరణను మరిచి పోయిందన్నారు. ఏపీ ఐడీసీ రాష్ట్ర మాజీ డైరెక్టరు దేవినేని పురుషోత్తం, మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ రేగటి నాగరాజు, తెదేపా రాయలసీమ జోన్ ప్రచార కార్యదర్శి బీవీ వెంకటరాముడు, నాయకులు నెట్టెం రాంబాబు, యర్రగుంట్ల వెంకటేశ్ బోస్ , ప్యారం భరత్ , సీˆతారాముడు, ప్యారం కేశవ పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post