ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేరుస్తామని ప్రజలను నమ్మించి, ఓట్లేయించుకొని గద్దెనెక్కిన జగన్.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని లెనిన్ కూడలి వద్ద మంగళవారం ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం ఆత్మగౌరవ దీక్ష’ను చేపట్టారు. ఈ సందర్భంగా చలసాని మాట్లాడుతూ.. ‘కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా యువతకు భవిష్యత్తు లేకుండా చేసింది. రాష్ట్ర ప్రజలు, యువత కోసం పార్లమెంటులో ఎంపీలు పోరాడాలి. లేకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు’ అని వైకాపాను హెచ్చరించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాల సమయంలో దిల్లీలో చేయనున్న పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. హోదా కోసం మోదీ ప్రభుత్వంపై జగన్, చంద్రబాబు, పవన్ నిజమైన పోరాటం చేయాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంటులో హోదాపై కేంద్రాన్ని ప్రశ్నిస్తే.. ఆయన ఆస్తులపై ఐటీ దాడులు చేయించి, ఎంపీగా పోటీ చేయకుండా భాజపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, సీపీఐ నగర కార్యదర్శి శంకర్ తదితరులు మాట్లాడారు. దీక్షలో సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, ఆప్, జై భారత్ నేషనల్ పార్టీ, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post