రాష్ట్రానికి మంచిరోజులు వస్తున్నాయని, అన్నివర్గాల వారికి మంచి జరగబోతోందని నినాదాలు చేస్తూ తెదేపా బెంగళూరు ఫోరం ఐటీ నిపుణులు ఆదివారం గోరంట్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలన్న ఆశయంతో తెదేపాకు మద్దతుగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉదయమే ప్రత్యేక వాహనాల్లో గోరంట్లకు చేరుకున్న వారు పెనుకొండ అసెంబ్లీ కూటమి అభ్యర్థి సవిత, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి తనయుడు సాయికుమార్‌తో కలిసి ఈ కార్యక్రమం కొనసాగించారు. కదిరి ప్రధాన రహదారిలో ఉన్న పశువైద్యశాల వద్ద నుంచి హిందూపురం రహదారిలో ఉన్న తెదేపా కార్యాలయం వరకు నినాదాలతో ప్రదర్శన సాగింది. జాబు కావాలంటే బాబు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి నినాదాలతో ముందుకు సాగారు. మార్గమధ్యంలో అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని బస్టాండు సమీపంలో విగ్రహానికి పూలమాల వేశారు. వీరికి మద్దతుగా మండలంలోని తెదేపా, జనసేన, భాజపాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
source : eenadu.net
Discussion about this post