రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అరాచకపాలన సాగిస్తోందని, ప్రభుత్వ తప్పులు, ఎమ్మెల్యేల అక్రమాలను పత్రికల్లో రాస్తే దాడులకు దిగడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, భాజపా నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నారు. బుధవారం పట్టణంలోని తన వ్యక్తిగత కార్యాలయంలో సూర్యనారాయణ మాట్లాడారు. కర్నూలులో ‘ఈనాడు’ కార్యాలయంపై ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపైనా వైకాపా మూకలు విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రోద్బలంతోనే దాడులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. దాడులకు పాల్పడినవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గత ఎన్నికల ముందు అఫిడవిట్‌లో రూ.5 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పొందుపరిచాడని, ఇప్పుడు వేల కోట్ల ఆస్తి ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పాలన్నారు.
వైకాపా నాయకులు బరితెగించారు: సాకే హరి
వైకాపా నాయకులు బరితెగించి దాడులకు తెగబడుతున్నారని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు మన్నన కోల్పోయిన వైకాపా ప్రభుత్వం… పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పి విధ్వంసాలకు పాల్పడుతోందని ఆరోపించారు. స్వయంగా సీఎం జగన్ బహిరంగ సభల్లో ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5పై యుద్ధం చేయాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లనే దారుణాలకు ఒడిగడుతున్నారన్నారు. జగన్‌కు కూడా పత్రిక, టీవీలు ఉన్నాయనే సంగతి దృష్టిలో ఉంచుకోవాలన్నారు. పత్రికలు, విలేకరులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.
ఫొటోగ్రాఫర్‌పై దాడికి పాల్పడిన నిందితుడికి రిమాండ్
గత ఆదివారం రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడికి పాల్పడిన కూడేరు మండలం మరుట్ల 2 కాలనీకి చెందిన మిద్దె ఎర్రిస్వామిని పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం విదితమే. నిందితున్ని బుధవారం పోలీసులు జిల్లా కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో జిల్లా కారాగారానికి తరలించారు.
మిగతా వారి అరెస్టు ఎప్పుడో?
వీడియో విజువల్స్ ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించి పట్టుకునేందుకు రంగంలోకి ప్రత్యేక బృందాలు ఏర్పాటు అయ్యాయని, ఇప్పటికే ఆరుగుర్ని గుర్తించామని, గాలింపు చర్యలు చేపట్టామని చెబుతున్న పోలీసులు.. మిగతా వారిని ఇంత వరకు అదుపులోకి తీసుకోలేదు. కాగా నిందితులను తప్పించేందుకు అధికార పార్టీ నాయకులు పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. దాంతో మిగతా నిందితుల అరెస్టుపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.
source : eenadu.net
Discussion about this post