రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం అనంతపురం జిల్లా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకు వైకాపా పెద్దలు అంగీకరించినట్లు సమాచారం. పార్టీపై తీవ్ర అసంతృప్తితో బయటకు వెళ్లిపోయిన ఎమ్మెల్యే కాపు రామంచంద్రారెడ్డిని తిరిగి తీసుకురావాలనే షరతు విధించినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి జయరాం ఎమ్మెల్యే కాపును బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల బళ్లారిలోని కాపు నివాసంలో వారు భేటీ అయ్యారు. తనను అధిష్ఠానం రాయదుర్గం పంపుతోందని.. సహకరిస్తే కళ్యాణదుర్గం టికెట్ వచ్చేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు కాపు రామచంద్రారెడ్డి తిరస్కరించారు. తిరిగి వైకాపాకు వచ్చేది లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రి జయరాం సోదరుడైన కర్ణాటక మంత్రి నాగేంద్ర ద్వారా కాపును ఒప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కాపు.. భాజపా సీనియర్ నాయకుడిని కలిసి అనంతపురం ఎంపీ, భార్యకు కళ్యాణదుర్గం టికెటు కోరినట్లు తెలుస్తోంది.
source : eenadu.net
Discussion about this post